Amaravati | వెంకన్న ఆలయం విస్తరణ పనులకు శ్రీకారం..

Amaravati | వెంకన్న ఆలయం విస్తరణ పనులకు శ్రీకారం..

  • రూ.260 కోట్లతో రెండు దశల్లో పనులు
  • భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు

ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో: రాజధాని అమరావతిలోని వెంకటపాలెం వెంకన్న భక్తులను విశేషంగా అలరిస్తున్నారు. రాజధాని గుంటూరు, విజయవాడ జిల్లాల తో పాటు, ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు నిత్యం భక్తులు తరలివస్తుంటారు. ఇక శనివారం భక్తులతో కిట.. కిటలాడు తుంటుంది.

రాజధానిలోని ఆలయం సందర్శించిన భక్తులకు తిరుమల క్షేత్ర వైభవాన్ని సాక్షాత్కారించినట్లు అనుభూతి కలుగుతుంది. తిరుమల ఆలయ తరహాలోనే మాడవీధులు.. పుష్కరిణితో పాటుగా స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆలయం అభివృద్ధికి ప్రత్యేక చొరవతీసుకుం టున్నారు.

తిరుమల తరహాలో భక్తులకు కొత్త అనుభూతి కలిగేలా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అమరావతి నిర్మాణ పనులతో పాటుగా శ్రీవారి ఆలయాన్ని అద్బుతంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం సిద్దమైంది. వెంకటపాలెం వెలిసిన ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజ గోపురం, మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితో పాటు- స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో శ్రీ వేంక టేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చి దిద్దేలా ప్రణాళికలు రూపొందించారు.

అందులో భాగంగా ఈ ఆలయానికి రెండో ప్రాకారం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల ఆలయం మాదిరిగానే అమరావతిలోనూ రెండో ప్రాకారం నిర్మించనున్నారు. ఆలయంలోపల, మహా రాజగోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం, ఉత్సవ మండపం, కోనేరు వంటివి కూడా రానున్నాయి. ఈ నిర్మాణాలతో ఆలయ వైభవం మరింత పెరగనుంది. ఇప్పటికే ప్రభుత్వం వెంకటపాలెం వద్ద ప్రధాన అను సంధాన రహదారికి, కృష్ణా కరకట్టకు మధ్యలో 25 ఎకరాలను కేటాయించింది.

దేవాలయానికి లోపలి ప్రాకారం మాత్రమే ఉండగా, ఇప్పుడు వెలుపలి ప్రాకారాన్నీ నిర్మించనున్నారు. అన్నదానం కాంప్లెక్స్‌, అర్చకులు, సిబ్బంది క్వార్టర్లు, రెస్ట్‌ హౌస్‌, భక్తులు వేచివుండే హాల్‌ వంటి నిర్మాణాల్ని రూ.20 కోట్లతో చేపడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా గురువారం ఈ పనులకు శంకుస్థాపన జరగనుంది. ఉదయం 10.55 నుంచి 11.30 గంటల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఊపందుకున్న ఆలయ అభివృద్ధి…

ఏడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ (టిడిపి) ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మొదట ఆమోదించింది, ఇది వెంకటపాలెం ప్రధాన యాక్సెస్‌ రోడ్డు, కృష్ణ నది కట్ట మధ్య 25 ఎకరాల భూమిని కేటాయించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ట్రస్టీల బోర్డు 2018లో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేందుకు నిర్ణయించింది.

అయితే ప్రభుత్వం మారడంతోఆలయ పురోగతి నిలిచిపోయింది, గత ప్రభుత్వం బడ్జెట్‌ను రూ. 36 కోట్లకు తగ్గించింది, నిర్మాణాన్ని ప్రధాన ఆలయం, లోపలి ప్రాకారం, ఒకే రాజగోపురం ద్వజస్తంభ మండపానికి పరిమితం చేసింది. కూటమి అధికారంలోకి రావడంతో, ఈ ప్రాజెక్టు తిరిగి ఊపందుకుందుకోవడంతో పాటు బడ్జెట్‌ రూ.185 కోట్లకు పెరిగింది.

సవరించిన ప్రణాళికలో రూ.84 కోట్ల వ్యయంతో విశాలమైన బాహ్య ప్రాంగణం, కల్యాణో త్సవం, ఉత్సవ మండపాలు, కట్‌ స్టోన్ ఫ్లోరింగ్, మాడ వీధులు, అప్రోచ్‌ రోడ్లు వంటి మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రాధా మండపం, ఆంజ నేయస్వామి ఆలయం, పవిత్ర పుష్కరిణి వంటి సౌకర్యాలు కూడా అభివృద్ధి చేయాలని కూటమి సర్కార్‌ సంకల్పించింది.

అందులో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. రూ. 20 కోట్ల వ్యయంతో అన్నదానం కాంప్లెక్స్‌, సిబ్బంది క్వార్టర్స్‌, విశ్రాంతి గృహం, వెయిటింగ్‌ హాల్‌ నిర్మించబడతాయి. సౌర విద్యుత్‌ ప్లాంట్‌, లైటింగ్‌ వ్యవస్థతో సహా ఆధునిక సౌకర్యాలు సుమారు రూ.11 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ప్రణాళికలు రూపొందించారు. భవిష్యత్‌లో తిరుమల తరహాలో వెంకటపాలెం వెంకన్న గుడి భక్తులను అలరించనుంది.