కారంపూడి హీరోకు సినీ శుభారంభం

కారంపూడి హీరోకు సినీ శుభారంభం
- ఈ నెల 22న విడుదల….!
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన యువ హీరో బత్తుల పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం “పురుషః” ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు స్థానిక ప్రజల్లో కూడా విశేష చర్చకు దారి తీస్తోంది. మే 22న విడుదల కానున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కారంపూడి, పల్నాడు ప్రాంత ప్రజలు, అలాగే పేదల పెన్నిధిగా పేరుగాంచిన ప్రముఖ కాంట్రాక్టర్ బత్తుల కోటేశ్వరరావు అభిమానులు, యువత పెద్ద ఎత్తున ఆకాంక్షిస్తున్నారు.
పల్నాడు ప్రాంతం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి తన ప్రతిభతో ముందుకు వస్తున్న బత్తుల పవన్ కళ్యాణ్‌పై పల్నాడు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బత్తుల కుటుంబానికి పల్నాడు ప్రాంతంలో ఉన్న మంచి పేరు, ప్రజలతో కలిసిపోయే స్వభావం కారణంగా ఈ సినిమాపై మరింత ఆదరణ కనిపిస్తోంది.

హీరో బత్తుల పవన్ కళ్యాణ్ తండ్రి, ప్రముఖ కాంట్రాక్టర్ బత్తుల కోటేశ్వరరావు పల్నాడు జిల్లాలో అన్ని ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడు. కారంపూడి ప్రాంతంలో ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిసినా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసినా ముందుండి సహాయం చేసే మనసున్న వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. కష్టం వచ్చినప్పుడు పలువురికి అండగా నిలిచి, అవసరమైన సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న వ్యక్తిగా స్థానిక ప్రజలు ఆయనను ప్రశంసిస్తున్నారు.
“డబ్బు కన్నా మనుషుల విలువ ఎక్కువ” అనే భావనతో అందరినీ ఆదరించే వ్యక్తిగా బత్తుల కోటేశ్వరరావుకు ఈ ప్రాంతంలో ప్రత్యేక గౌరవం ఉందని చెప్పవచ్చు. అందుకే ఇప్పుడు ఆయన కుమారుడు బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “పురుషః” సినిమా ఘన విజయం సాధించాలని కారంపూడి ప్రజలతో పాటు పల్నాడు ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు.
“మాకు సహాయం చేసిన కుటుంబం మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలి” అంటూ పలువురు అభిమానులు, స్థానిక యువత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ప్రచార కార్యక్రమాలు “పురుషః” సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. యాక్షన్, భావోద్వేగాలు, సమాజానికి దగ్గరగా ఉండే అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
మే 22న ప్రేక్షకుల ముందుకు రానున్న “పురుషః” చిత్రం మంచి విజయాన్ని అందుకుని హీరో బత్తుల పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణంలో ప్రత్యేక మైలురాయిగా నిలవాలని, ముఖ్యంగా కారంపూడి ప్రజలతో పాటు పల్నాడు ప్రాంత ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
