Vijayawada | నవనీత అలంకరణలో శ్రీనివాసుడు..

Vijayawada | నవనీత అలంకరణలో శ్రీనివాసుడు..
- ముక్కోటి ఏకాదశి రోజు ప్రత్యేక అలంకరణ..
- సర్వాంగ సుందరంగా వెంకన్నకు అలంకరణ..
- వేకువజామునే ప్రత్యేక పూజలు..
- ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం..
Vijayawada | విజయవాడ, ఆంధ్రప్రభ : నవనీత అలంకరణలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కనువిందు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకునే మంగళవారం నగర పరిధిలోని తాడిగడప గ్రామం ఎస్టిబిఎల్ కాలనీలో ఉన్న శ్రీనివాస క్షేత్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని వెన్నతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేకంగా స్వామివారిని వెన్నతో అలంకరించగా స్వామివారి దివ్య మంగళ స్వరూపం భక్తులను కనువిందు చేస్తుంది.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజామునుండే ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించగా, ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. తాడిగడప గ్రామంతో పాటు పరిసర గ్రామాలు విజయవాడ నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. పర్వదినాన్ని పురస్కరించుకునే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించడంతో విద్యుత్ దీపాలంకరణలో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
