Gudivada | ఆ ఇద్దరిని.. మోసగించిన సైబర్ నేరగాళ్లు..

Gudivada | ఆ ఇద్దరిని.. మోసగించిన సైబర్ నేరగాళ్లు..
Gudivada, గుడివాడ, ఆంధ్రప్రభ : సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డులేకుండాపోతోంది. అమాయక మహిళలకు ఆశ చూపి అమాంతంగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు లాగేస్తున్నారు. వారంలో గుడివాడలో ఇద్దరు మహిళలు వీరి బారినపడి నగదు పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడివాడ పట్టణంలోని రైలుపేటకు చెందిన నిహారిక అనే యువతి తన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ద్వారా దుస్తులు కొనుగోలు చేసింది. ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసిన వెంటనే ఆమె ఫోనుకు ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. మీరు డెలివరీ ఛార్జీల కోసం రూ.3 వేలు ఆన్లైన్ అకౌంట్ కు ముందుగా చెల్లిస్తే.. డెలివరీ రోజునే మీకు మిగిలిన మొత్తం చెల్లించేస్తానని, తన పేరు అజిత్ కుమార్ (న్యూ ఢీల్లీ) అని నమ్మబలికాడు.
దీనికి ఆమె ససేమిరా అంటే.. తన బిడ్డల మీద ఒట్టు వేస్తున్నానని, తాను చిరు వ్యాపారినని రూ.లక్ష సరకు ఒకేసారి డెలివరీ చేయాల్సి ఉందని, కానీ తన వద్ద అంత మొత్తం లేక కస్టమర్ ద్వారానే డెలివరీ చార్జీలు కట్టించుకుని మళ్లీ వారికి తిరిగి చెల్లిస్తున్నానని ప్రాధేయపడగానే ఆ యువతి రూ.3వేలు చెల్లించింది. మళ్లీ రెండో రోజు సదరు వ్యక్తి తన ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులను పంపి నన్ను నమ్మండి.. డెలివరీకి నగదు తగ్గింది.. మరో రూ.7 వేలు చెల్లిస్తే వెంటనే తిరిగి ఇచ్చేస్తానని కోరగా ఆమె ఈ మొత్తాన్ని పంపింది. ఆ తర్వాత అదే వ్యక్తి తన పాన్ కార్డును నిహారికకు పంపి తాను సైబర్ నేరగాడిని కాదని.. నమ్మాలని.. మరో రూ.50 వేలు పంపితే మొత్తం నగదును దుస్తులతో పాటు వెనక్కి చెల్లిస్తానని చెప్పాడు. దీంతో ఆమె ఈ మొత్తాన్ని కూడా పంపింది.
ఇంట్లో వారికి ఈ విషయం తెలిసి ఆమెను మందలించే సరికి ఆ యువతి 1930కు ఆన్లైన్లో ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఫిర్యాదు చేయడం వల్ల ఎస్బీఐ ద్వారా చెల్లించిన రూ.10 వేలు వెనక్కి రాగా.. మరో బ్యాంకు ద్వారా పంపిన రూ.50 వేలు బ్లాక్ చేసిన ఖాతాను బ్లాక్ నుంచి తీయిస్తే తిరిగి నగదు చెల్లిస్తానని నిందితుడు నిహారికకు ఫోన్ చేస్తున్నాడు. అలాగే పట్టణంలోని దనియాల పేటకు చెందిన మరో యువతి ఆన్ లైన్ యాప్ ద్వారా రూ.6 వేలు రుణం తీసుకుని వారంలో రూ.10 వేలు చెల్లించింది. కానీ సదరు యాప్ వారు మరో రూ.10 వేలు ఇవ్వాలని బెదిరించారు. ఆమె స్పందించకపోవడంతో ఆమె ఫొటో లను నగ్నంగా ఉన్నట్టు మార్ఫింగ్ చేసి పెట్టారు. వెంటనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. తాము చేసేదేమీ లేదని, ఫోన్ సిమ్ తీసేయాలని సలహా ఇచ్చి పంపారు.
