Guntur | వినుకొండలో దారుణ హత్య

Guntur | వినుకొండలో దారుణ హత్య

  • కుటుంబ కలహాల్లో బావమరిది మృతి
  • సిలిండర్‌తో దాడి

పల్నాడు జిల్లా వినుకొండలో కుటుంబ కలహాలు చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కేవలం మాటల గొడవతో మొదలైన వివాదం, కక్షగా మారి ఒక వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. శృంగారపువనం కాలనీలో బావ చేతిలోనే బావమరిది ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం, క్రోసూరు మండలానికి చెందిన చిలక గోపి అనే వ్యక్తికి తన బావమరిది రాచకొండ షారోన్‌తో గత కొంతకాలంగా కుటుంబ విషయాలపై మనస్పర్థలు వ‌చ్చాయి. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవ జరిగింది. ఆ కక్షను మనసులో పెట్టుకున్న గోపి, షారోన్ నిద్రిస్తున్న సమయంలో అతి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లోని చిన్న గ్యాస్ సిలిండర్‌ను తీసుకుని షారోన్ తలపై బలంగా బాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన‌ షారోన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.

కేసు నమోదు..

ఈ ఘోర ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న వినుకొండ సీఐ ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు చిలక గోపిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్న చిన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోకపోతే ఇలాంటి దారుణ పరిణామాలు ఎదురవుతాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబంలో ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. ఈ హత్యోదంతం వినుకొండ పరిసర ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply