Bhatti Vikramarka | నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు…

Bhatti Vikramarka | నిరంతరాయ విద్యుత్ సరఫరాకు పటిష్ట చర్యలు…

  • డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు
  • 13 వేల 500 కోట్లతో 96 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ

Bhatti Vikramarka | ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : రైతులకు, ప్రజలకు పారిశ్రామికవేత్తలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఇవాళ తల్లాడ మండలం పినపాక, అన్నారుగూడెం, కల్లూరు మండలం లింగాల గ్రామాల్లో 10 కోట్ల 53 లక్షల రూపాయల అంచనాతో చేపట్టిన మూడు 33/11 కె.వి. సబ్ స్టేషన్ ల నిర్మాణ పనులకు ఎన్.పి.డి.సి.ఎల్. సీఎండీ వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్ లతో కలిసి పినపాక గ్రామంలో శంకుస్థాపన చేశారు.

ఈసందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా సబ్ స్టేషన్ లను నిర్మించాలని, స్థానిక ఎమ్మెల్యే అందించిన ప్రతిపాదన మేరకు తల్లాడ మండలం పినపాక, అన్నారు గూడెం, కల్లూరు మండలం లింగాల మూడు గ్రామాల్లో సబ్ స్టేషన్లు మంజూరు చేసుకుని వాటి నిర్మాణ పనులకు భూమిపూజ చేసుకున్నామని తెలిపారు.

Bhatti Vikramarka

తల్లాడ, కల్లూరు మండలంలో ఉన్న రైతులకు, రైతు కూలీలకు, సామాన్యులకు ఎవరికైనా విద్యుత్ చాలా కీలకమన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా ఉంటే మంచి పంటలు పండుతాయని, సబ్ స్టేషన్ నిర్మాణం ద్వారా మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుందని, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో 55 వేల 588 కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటివరకు పేదలు, రైతుల తరపున 123 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థకు చెల్లించడం జరిగిందన్నారు.

ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని, దీని ఫలితంగా ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో తాము గెలుపొందామని డిప్యూటీ సీఎం తెలిపారు. గతంలో ప్రతిపక్షం తరఫున తాను ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందని, ఒక రోజు కూడా సభకు గైర్హాజరు కాలేదని, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుండా తన కర్తవ్యాన్ని నెరవేర్చడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని డిప్యూటీ సీఎం విమర్శించారు.

గత ప్రభుత్వం పాటించిన విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో ధ్వంసమైనప్పటికీ ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు 26 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు పంపిణీ చేశామన్నారు. 96 లక్షల కుటుంబాలకు 13 వేల 500 కోట్లు ఖర్చు చేస్తూ నాణ్యమైన సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను గత పాలకులు మోసం చేస్తే, మన ప్రజా ప్రభుత్వం 22 వేల 500 కోట్లు ఖర్చు చేస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3500 ఇండ్ల చొప్పున మొత్తం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. పేద ప్రజలు ఆత్మ గౌరవంతో ఉండేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

Bhatti Vikramarka

ప్రతి సంవత్సరం రైతుల పక్షాన 12 వేల 500 కోట్ల రూపాయలు రైతుల తరపున విద్యుత్ శాఖకు చెల్లిస్తూ 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నా మని, నిరుపేదలకు రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, దీనిని గమనించిన ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ విషం కక్కుతున్నారని, దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పిలుపునిచ్చారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు గృహ అవసరాల కోసం 200 యూనిట్లు, రైతులకు వ్యవసాయ పనుల నిమిత్తం 24 గంటలు, ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రావద్దని 33/11 కేవీ సబ్ స్టేషన్ లను నిర్మిస్తున్నామన్నారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ… ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, విద్యుత్ శాఖ ఎస్ఇ ఇనుగుర్తి శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్ఇ యాకొబ్, ఇర్రిగేషన్ ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply