Gudivada | 30న ముక్కోటి ఏకాదశి వేడుకలు

Gudivada | 30న ముక్కోటి ఏకాదశి వేడుకలు
- వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్లకు..
- ధర్మకర్తల కమిటీ సమావేశం
Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన జగన్నాథపురంలోని శ్రీ భూనీలా సమేత వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల కమిటీ సభ్యులు, భక్తులు (Devotees) ఆదివారం ఉదయం దేవస్థాన ప్రాంగణంలో సమావేశమయ్యారు. ప్రతి ఏటా పెద్ద ఎత్తున జరిగే వేడుకల్లో వేలాదిగా పాల్గొనే భక్తులకు అసౌకర్యం కలుగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, కమిటీ సభ్యులు చర్చించారు.
అనంతరం దేవస్థానం వేద పండితులు వేదాంతం అపలాచారి మాట్లాడుతూ.. 30వ తేదీ వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజాము రెండు గంటల 15 నిమిషాలకు తీర్థ బిందె గోష్టి కార్యక్రమంతో వేడుకలు (celebrations) ప్రారంభం అవుతాయన్నారు. నాలుగు గంటలకు స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనం ఇస్తారని వెల్లడించారు.
దేవస్థానం ఈవో కందుల గోపాలరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ (Committee Chairman) లింగం శివరామ ప్రసాద్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా భారీ క్యూ లైన్లను ఏర్పాటు చేశామన్నారు. పెద్ద ఎత్తున వేడుకలు జరగనున్న దృష్ట్యా , పోలీస్, ఫైర్ తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని, దేవస్థానం ప్రాంగణాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో దేవస్థానం ధర్మకర్తల కమిటీ సభ్యులు…ఉత్సవ కమిటీ సభ్యులు నిమ్మగడ్డ కృష్ణా రావు, చందు శ్రీనివాసరావు, పి.రాజేశ్వరరావు, వేదాంతం కృష్ణ వేణి, కొడాలి విజయలక్ష్మి, గూడపాటి సుజాత, పంతంగి హేమ, జోగి సాంబశివరావు, ఆండాల్ గోస్ట్ సభ్యులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
