VeneZula Blockade : అమెరికా అత్యాశ AndhraPtrabha Analasys

VeneZula Blockade : అమెరికా అత్యాశ AndhraPtrabha Analasys
వెనిజులా బానిసత్వం
ఇటు ఆర్థిక వెఫన్
అటు సైనిక దాడిపద్మవ్యూహంలో వెనిజులా విలవిల
లాటిన్ అమెరికాలోనే కాదు.. ప్రపంచంలోనే సుసంపన్న వెనిజులా దేశం.. తాజాగా వెలవెలబోతోంది. వందల ఏళ్ల బానిసత్వం పీడన.పాలకుల నియంతృత్వం, ఆర్థిక సంక్షోభం..కరవు కాటకాలు.. అంతర్గత యుద్ధం.. ఇలా అన్ని అనుభవాలను చవి చూసిన అందాల తార వెనిజులాపై ప్రస్తుతం అమెరికా కన్ను పడింది. యుద్ధ మేఘాలు (War Shade) కమ్ముకున్నాయి. అమెరికా విసిరిన సంపూర్ణ దిగ్బంధనంలో (Blockade) బంధీగా మారింది. ఏ క్షణం బాంబుల వర్షం కురుస్తుందో.. ఎంత మంది చావుకు సిద్ధం కావాలో.. ఇదీ ఈ రోజు వెనిజుల జనం గుండెల్లో అలజడి.
( ఆంధ్రప్రభ, నెట్ వర్క్ అనాలిసిస్)
ఔను.. అమెరికా, వెనిజులా మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధ వాతావరణం (War Shade) నెలకొంది. 2025 డిసెంబర్ నాటికి క్లైమాక్స్ దశకు చేరింది . వెనిజులా పై అమెరికా ఒక వైపు ఆర్థిక యుద్ధం, మరో వైపు సైనిక దాడులతో.. వెనిజులా (Venezuela) ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. తాజా పరిణామాల ప్రకారం పరిస్థితి యుద్ధం దారిలో ఇరు దేశాలు సన్నద్ధమవుతున్నాయి. అమెరికా ఏక పక్ష ధొరణితో .. తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తుంటే.. రష్యా, చైనా,ఇరాన్, క్యూబా దేశాలు వెనిజులకు బాసటగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతం అమెరికా (America) దిగ్బంధనంలో వెనిజులా చిక్కుకుంది, (Naval Blockade) వెనిజులా చమురు రవాణాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపూర్ణ దిగ్బంధనం విధించారు. ఇప్పటికే వెనిజులా జలాల సమీపంలో అమెరికా నౌకాదళం మోహరించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా (Narco-terrorism) నెపంతో వెనిజులా నౌకలపై అమెరికా దళాలు దాడులు చేస్తున్నాయి. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 28 దాడులలో సుమారు 104 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వెనిజులాకు చెందిన ఒక ప్రధాన చమురు ట్యాంకర్‌ను (Skipper ) అమెరికా దళాలు ఇటీవలే స్వాధీనం చేసుకున్నాయి. వెనిజులా ప్రభుత్వం అంతర్జాతీయ పైరసీ (దోపిడీ) గా ఆరోపించింది. కరేబియన్ (Caribbean Sea) సముద్ర ప్రాంతంలో జీపీఎస్ (GPS) సిగ్నల్స్ జామింగ్ జరుగుతోంది, ఫలితంగా విమానాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.

ఇటీవలే ఒక అమెరికన్ మిలిటరీ విమానం జెట్‌బ్లూ ప్యాసింజర్ విమానం గాలిలో ఢీకొనే ప్రమాదం తృటిలో తప్పింది. అంటే వెనిజులా ప్రపంచంతో సంబంధాన్ని అమెరికా తెగతెంపులు చేస్తోంది. ఇంత కిరాతంగా అమెరికా ఎందుకు ప్రవర్తిస్తోంది.? తమ చమురు నిల్వలను (Crude Oil Reserves) హస్తగం చేసుకోవటానికి అమెరికా ప్రయత్నిస్తోందని వెనిజులా ప్రభుత్వం వాదిస్తోంది. అమెరికా విధించిన చమురు దిగ్బంధనాన్ని తమ సహజ వనరుల చోరీగా వెనిజులా అభివర్ణిస్తోంది. తన సార్వభౌమాధికారం కోసం పోరాడుతున్నామని వెనిజులా చెబుతుండగా, ప్రజాస్వామ్యం పేరుతో ప్రాంతీయ భద్రత కోసం మదురో ప్రభుత్వాన్ని తొలగించాలని అమెరికా చూస్తోంది.
VeneZula Blockade : అమెరికా ఆరాటం..

అమెరికా వెనిజులా మధ్య గత 25 ఏళ్లుగా నిరంతర ఘర్షణ సాగుతోంది. అమెరికాతో వెనిజులా గొడకు కారణమేంటీ? అమెరికా సామ్రాజ్యవాదం పెత్తందారి జోక్యమే ప్రధాన కారణం. తన దేశ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని, తన ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తోందని వెనిజులా ఆరోపిస్తోంది. 2002లో అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ను (Hugo Chavez) గద్దె దించేందుకు జరిగిన వెనుక అమెరికా కుట్ర ఉందని వెనిజులా వాదిస్తోంది. ఇక వెనిజుల అపార సహజ సంపదలపై అమెరికా ఫోకస్ ఉంది. ప్రపంచంలోనే అత్యధిక వెనిజులా చమురు నిల్వలు, సుమారు 300 బిలియన్ బారెళ్ల ముడి చమురు (Crude Oil) నిల్వలతో ప్రపంచంలోనే వెనిజులా ప్రథమ స్థానంలో ఉంది. భారీగా బంగారు గనులు ఉన్నాయి.

ప్రపంచంలోనే సహజ వాయువు (Natural Gas) 7వ అతిపెద్ద నిల్వలు ఇక్కడ ఉన్నాయి. ఇక ఇనుము, బాక్సైట్, వజ్రాలు , ఎలక్ట్రానిక్స్ తయారీలో వినియోగించే కీలక ఖనిజం ‘కోల్టన్’ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ముఖ్యంగా వెనిజులా చమురు రష్యా, చైనా దేశాల్లోకి వెళ్లకుండా అడ్డుకోవటం అమెరికా వ్యూహం. అమెరికాకు సమీపంలోని వెనిజులాలో రష్యా, చైనా, ఇరాన్ దేశాల ప్రభావం పెరిగే తన రక్షణకు ముప్పుగా అమెరికా భావిస్తోంది.
VeneZula Blockade : వెనిజులా విలవిల

అమెరికా విధించిన కఠిన ఆంక్షలతో వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. తీవ్ర ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల కొరత, ఆరోగ్య సేవల లేమి , ఉపాధి కరువుతో వెనిజులా ప్రజలు ప్రాణాలకు తెగించి ప్రమాదకర మార్గాల్లోనూ (Dangerous Ways) వలస వెళ్తున్నారు. అమెరికా చర్యలతో మందులు, ఆహారం కొరత ఏర్పడింది, వేలాది మంది చనిపోయారని వెనిజులా ఆరోపిస్తోంది. లక్షలాది మంది వెనిజులా ప్రజలు దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.

ప్రపంచంలోనే అతిపెద్ద వలస సంక్షోభం (Big Migrant Crices) ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి (UN) వివిధ అంతర్జాతీయ సంస్థల తాజా గణాంకాల ప్రకారం , 2025 మే నాటికి 7.9 మిలియన్ల మంది వెనిజులా ప్రజలు తమ దేశాన్ని విడిచిపెట్టారు. శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లారు. వీరిలో అత్యధికంగా సుమారు 6.7 మిలియన్ల మంది లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు చేరుకున్నారు.

కొలంబియా (Colambia) లో సుమారు 2.81 మిలియన్ల మంది పెరూ (peru)లో 1.66 మిలియన్ల మంది ఆశ్రయం పొందారు. బ్రెజిల్ 6.8 లక్షలు, చిలీ 6.6 లక్షలు, ఈక్వెడార్ 4.4 లక్షలు మంది వెనిజులా వలసజీవులు ఆశ్రయం పొందారు. యూరోపియన్ యూనియన్ (EU) దేశాలలో ఆశ్రయం కోరుతున్న వారిలో వెనిజులా ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారు. EU లో శరణార్థి హోదా కోసం 2025 లోనే సుమారు 50,000 మంది వెనిజులా జనం దరఖాస్తు చేసుకున్నారు.
VeneZula Blockade : అమెరికా చెలగాటం

వెనిజులాకు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా దేశం (Narco State) “నార్కో-స్టేట్” గా అమెరికా ముద్ర వేసింది. కరేబియన్ సముద్రంలో అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌక (USS Gerald R. Ford) సహా సుమారు 15,000 మంది సైనికులను మోహరించింది. సెప్టెంబర్ 2025 నుండి అమెరికా సైన్యం జరిపిన 25కు పైగా దాడులలో సుమారు 104 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటిని అమెరికా డ్రగ్ బాట్లపై దాడులుగా పేర్కొనగా, వెనిజులా వీటిని అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా పేర్కొంది.
VeneZula Blockade : వెనిజులా అధ్యక్షుడే టార్గెట్

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) ని అమెరికా టార్గెట్ (Target) చేసింది. అధ్యక్షుడు మదురో కుటుంబ సభ్యులు, సన్నిహితులపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ కొత్త ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల ప్రధాన ఉద్దేశ్యం మదురో ప్రభుత్వానికి అందుతున్న ఆర్థిక వనరులను తుడిచిపెట్టడం.
మదురో భార్య సిలియా ఫ్లోరెస్ మేనల్లుడు కార్లోస్ ఎరిక్ మాల్పికా ఫ్లోరెస్ మరియు అతని కుటుంబ సభ్యులపై ఆంక్షలు విధించారు. ఎలోయిసా ఫ్లోరెస్ డి మాల్పికా మాల్పికా ఫ్లోరెస్ తల్లి , సిలియా ఫ్లోరెస్ సోదరి . కార్లోస్ ఎవెలియో మాల్పికా టొరియల్బా (తండ్రి). ఇరియామ్ని మాల్పికా ఫ్లోరెస్ (సోదరి). దమారిస్ డెల్ కార్మెన్ హుర్టాడో పెరెజ్ (భార్య). ఎరికా ప్యాట్రిసియా మాల్పికా హుర్టాడో (కుమార్తె), వెనిజులా ప్రభుత్వంతో సంబంధం ఉన్న పనామా వ్యాపారవేత్త రమోన్ కారెటెరో నపోలిటానో, అతని కుటుంబ సభ్యులను బ్లాక్ లిస్టులో పెట్టారు. అమెరికా లోని అన్ని రకాల ఆస్తులు బ్యాంకు ఖాతాలను నిలిపివేస్తారు (Freeze). అమెరికా పౌరులు లేదా కంపెనీలు ఈ వ్యక్తులతో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకూడదు. వీరికి అమెరికాలోకి ప్రవేశించేందుకు వీసా లభించదు.
VeneZula Blockade : అమెరికాకు లాభమా? నష్టమా?

మదురో ప్రభుత్వం పడిపోయి, అమెరికాకు అనుకూల ప్రభుత్వం వస్తే అమెరికా కంపెనీలకు చమురు రంగాన్ని అప్పగించే అవకాశం ఉంటుంది. లాటిన్ అమెరికాలో రష్యా, చైనాల ప్రభావాన్ని తగ్గించవచ్చు. వెనిజులాలోని ఆర్థిక సంక్షోభంతో లక్షలాది మంది ప్రజలు అమెరికా సరిహద్దుల్లోకి వలస వస్తున్నారు. అక్కడ రాజకీయ స్థిరత్వం వస్తేనే ఈ వలసలు ఆగుతాయని అమెరికా నమ్మకం. ఒకవేళ నేరుగా సైనిక దాడి జరిగితే అది సుదీర్ఘ కాలం సాగి అమెరికాకు భారీ ఆర్థిక భారాన్ని ప్రాణనష్టాన్ని మిగిల్చవచ్చు. చమురు సరఫరాకు ఆటంకం కలిగితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి అమెరికా ప్రజలపై భారం పడుతుంది.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రస్తుత పరిస్థితిని “భరించలేనిది” అని పేర్కొంటూ, వెనిజులాలో అధికార మార్పు (Regime Change) కోసం అన్ని మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా మదురో, అమెరికా తమ చమురు సంపదను దోచుకోవడానికి యుద్ధాన్ని సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, దక్షిణ అమెరికాలో ఏ క్షణమైనా పూర్తి స్థాయి యుద్ధం సంభవించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ : Operation Hawk Eye Straikes : 70 ఐఎస్ స్థావరాలు ధ్వంసం
