నాటి పారిశుద్ధ్య కార్మికురాలు.. నేడు సర్పంచ్ !!

  • రేకంపల్లి సర్పంచిగా కొలుగూరి సుజాత

నర్సంపేట, ఆంధ్రప్రభ : నాడు మల్టీపర్పస్ (పారిశుద్ధ్య) కార్మికురాలిగా పనిచేసి, నేడు గ్రామ సర్పంచ్‌గా గెలుపొందిన అరుదైన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

రేకంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొలుగూరి సుజాత, బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన ఈసం పెళ్లి నాగలక్ష్మిపై 208 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

సుజాత గతంలో అదే గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ కార్మికురాలిగా విధులు నిర్వహిస్తూ వీధుల శుభ్రత, డ్రైనేజీలలో మురికిని తొలగించడం, గ్రామంలో తాగునీటి సరఫరా వంటి పనులు చేశారు. కార్మికురాలిగా పనిచేస్తూనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎస్సీ మహిళ రిజర్వేషన్ కేటగిరీలో జరిగిన ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రముఖ నేతలు విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ సుజాత విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సుజాత భర్త ఏడాది క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు కూడా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ, తాను సర్పంచ్‌గా గెలుస్తానని, ఆ స్థాయికి చేరుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అండదండలతో పనిచేసి, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి అందరి మన్ననలు పొందుతానని తెలిపారు.

సుజాత గెలుపుతో రేకంపల్లి గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయడానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply