ప్రజల కోసం పనిచేసే వారిని మాత్రమే గెలిపించండి..

- మాజీ ఎంపీటీసీ బలరాం రెడ్డి
మక్తల్, ఆంధ్రప్రభ: పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉండి పనిచేసేవారిని మాత్రమే సర్పంచ్‌గా ఎన్నుకోవాలని మాజీ ఎంపీటీసీ జి. బలరాం రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మక్తల్ మండలంలోని సంగంబండ గ్రామపంచాయతీ పరిధిలోని పలు వార్డులలో సర్పంచ్ అభ్యర్థి సందనోళ్ళ కళావతి లక్ష్మీకాంత్ రెడ్డి తో కలిసి విస్తృత ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా బలరాం రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ అభివృద్ధి సాధించాలంటే స్థానికంగా ఉండి నిరంతరం ప్రజల మధ్య ఉండే వ్యక్తిని మాత్రమే సర్పంచ్‌గా ఎన్నిక చేసుకోవాలి అని అన్నారు. స్థానికంగా ఉండే అభ్యర్థి సందనోళ్ళ కళావతి లక్ష్మీకాంత్ రెడ్డిని సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పంచాయతీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. ఎంపీ డీకే అరుణమ్మ ద్వారా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాన్ని పూర్తిస్థాయిగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని బలరాం రెడ్డి తెలిపారు.
అలాగే, మాయమాటలు చెప్పే వారిని నమ్మి మోసపోకుండా, నిరంతరం ప్రజల కోసం పనిచేసే వారిని మాత్రమే గెలిపించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులకు సూచించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో నాయకులు గవినోళ్ళ బలరాం రెడ్డి, నరసింహ రెడ్డి, చిన్నారెడ్డి, స్వప్న, నరసింహ, కృష్ణారెడ్డి, ఎం. నాగిరెడ్డి, వై. పల్లవి తదితరులు పాల్గొన్నారు.
