WOMEN | నామినేషన్ ఫీజు కోసం జోలె పట్టిన సర్పంచ్ అభ్యర్థి

WOMEN | నామినేషన్ ఫీజు కోసం జోలె పట్టిన సర్పంచ్ అభ్యర్థి

  • 2019 సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన బానోత్ బద్రి.
  • ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుతున్న గిరిజన మహిళా.
  • నామినేషన్ ఫీజు కోసం మూడువేల రూపాయలను సేకరించిన సర్పంచ్ అభ్యర్థి బద్రి.
  • కాకర్ల సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన బానోత్ బద్రి.


WOMEN | జూలూరుపాడు, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవి కోసం పోటీపడుతూ గ్రామాల్లో నిర్వహించే వేలం పాటల్లో పాల్గొని లక్షలాది రూపాయలకు పదవి దక్కించుకుంటున్న వార్తలు ఈ ఎన్నికల్లో (Election) కోకొల్లలుగా కళ్ళముందు నిలుస్తున్నాయి. దీనికి భిన్నంగా నామినేషన్ ఫీజు కోసం జోలె పట్టిన మహిళ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.

శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా జూలూరుపాడు మండల కాకర్ల గ్రామ పంచాయతీకి జరిగే ఎన్నికల్లో బరిలో నిలిచిన బానోత్ బద్రి వినూత్న ప్రచారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభంలోనే హాట్ టాపిక్ గా మారింది. మండలంలోని దుబ్బ తండాకు చెందిన బానోత్ బద్రి భర్త శ్రీను కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో పంచాయతీ స్థానానికి పోటీ చేస్తున్నారు. 2019వ సంవత్సరంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాకర్ల సర్పంచ్ స్థానానికి బరిలో నిలిచిన బద్రి 506 ఓట్లు సాధించి ఓటమి పాలయ్యింది.

గత ఎన్నికల్లో ఓడిపోయిన త‌న‌ను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆర్థిక సహాయం కోసం జోలె పట్టిన మహిళ (Women) బానోత్ బద్రి నామినేషన్ ఖర్చులకు ప్రజల నుంచి మూడువేల రూపాయలు సమకూరాయి. ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిస్వార్ధంగా కృషి చేస్తానని బద్రి ప్రజలను వేడుకున్నారు. బద్రి నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్తినేని గోపి, అల్లాడి నరసింహారావు, పాతర్లపాటి సతీష్, గొసి రామకృష్ణ, స్వామి, తదితరులు పాల్గొన్నారు.