Document Registration | డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్..!

Document Registration | డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్..!
- తాండూరు ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్
- ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వసూళ్లు
- ట్రాప్ చేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు
- ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్, ఇద్దరు రైటర్ల అరెస్టు
Document Registration | తాండూరు, ఆంధ్రప్రభ : తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్(Sub Registrar) గా పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ లంచావతారం ఎత్తారు. డబ్బులిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని.. ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వసూళ్లకు పాల్పడ్డాడు. రిజిస్ట్రార్, ఇద్దరు డాక్యుమెంట్(Document) రైటర్లను అరెస్టు బాధితుని ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు(ACB Officers) ట్రాప్ చేసి లంచం తీసుకుంటున్న ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్, ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లను అరెస్టు చేశారు. ఈ సంఘటన బుధవారం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తాండూరు ప్రాంతానికి చెందిన ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి తనకు చెందిన భూమిని 11 డాక్యుమెంట్లుగా చేసి కుటుంబ సభ్యులతో పాటు విక్రయదారులకు రిజిస్ట్రేషన్ చేయాలని తాండూరు సబ్ కార్యాలయంలో సంప్రదించారు. ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న సాయికుమార్ (జూనియర్ అసిస్టెంట్) డాక్యుమెంట్లు సరిగ్గాలేవని వంకలు పెడుతూ నిరాకరించారు.
కార్యాలయం ముందు ఉన్న ఓ ఆఫీసులు ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్న అశోక్, అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ సాయిలు సదరు వ్యాపారి రిజిస్ట్రేషన్ లు చేయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ముందుగా ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్(Document Registration) చేయాలంటే రూ.2వేలు చొప్పున ఇవ్వాలని ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ కోరారని డాక్యుమెంట్ రైటర్లు సదరు వ్యాపారికి తెలిపారు.
మరోసారి మాట్లాడగా.. ఒక్కో డాక్యుమెంట్ కు రూ.1500ల చొప్పున రూ. 16,500లు ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. అంత డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బృందం ట్రాప్ చేశారు. అప్పటికే ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయి 4 డాక్యుమెంట్ లను రిజిస్టర్ చేశారు.
మిగతా వాటిని చేయాలంటే రూ.16,500లు ఇవ్వాలని మరోసారి లంచం డిమాండ్ చేశారు. ఈ రోజు ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయి డాక్యుమెంట్ రైటర్లు(Document Writers) అశోక్, సాయిల ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని మూసి వేసి.. విచారణ చేపట్టారు. మరోవైపు నిందితుల ఇళ్ల వద్ద కూడా సోదాలు నిర్వహించారు. పూర్తి విచారణ జరిపి ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్ సాయి. డాక్యుమెంట్ రైటర్లు అశోక్, సాయిలను అరెస్టు చేయడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

