WATER | ధర్మవరం రైతులకు తీపికబురు

WATER | ధర్మవరం రైతులకు తీపికబురు
మంత్రి సత్యకుమార్ కీలక నిర్ణయం
బత్తలపల్లి–తాడిమర్రి చెరువులకు
నీరు విడుదలకు కసరత్తు
WATER | ( శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ) ధర్మవరం నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెరచుకోని కుడి కాలువ గేటు మరమ్మత్తులకు యుద్ద ప్రాతిపదికన మంత్రి రూ. 29 లక్షలు విడుదల చేయించిన ఫలితంగా నీరు విడుదలకు రంగం సిద్ధమైంది. మంత్రి సత్య కుమార్ యాదవ్ నిరంతర కృషి ఫలితంగా, పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి చెరువులకు మొత్తం 2.5 టీఎంసీల నీరు విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నిర్ణయంతో వేలాది ఎకరాల పంటలకు సాగునీరు అంది, ధర్మవరం నియోజకవర్గ వ్యవసాయ రంగం మరింత బలోపేతం కానుంది.
ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, హెచ్చెల్సీ ఎస్ఈ, పీఏబీఆర్ ఎస్ఈ ఇతర విభాగాల అధికారి లతో సమీక్షించారు. నీటి వనరుల అందుబాటు, పంపిణీ విధానం, కాలువ నిర్వహణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు.
ఆయకట్టు చివరి ప్రాంతాలయిన ధర్మవరం రూరల్, బత్తలపల్లి, తాడిమర్రి చెరువులను ముందుగానే నింపడం ప్రథమ ధ్యేయంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ సూచించారు. రాబోయే రబీ సాగు దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికలతో నీటి విడుదలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో సాగునీటి ప్రాజెక్టులు అత్యంత ప్రాధాన్యంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో ఇంకా మరిన్ని నీటి వనరులను ప్రాంతానికి తీసుకురావడానికి కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అలాగే పీఏబీఆర్ కుడి కాలువ గేటు శాశ్వత మరమ్మత్తులకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
