మహనంది వెళ్లి వస్తుండగా ప్రమాదం
ప్రకాశం జిల్లా తాటిచెర్లమోటు వద్ద ఘటన
మృతులందరూ స్టూవర్టుపురం వాసులు
గిద్దలూరు , ఆంధ్రప్రభ – ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నఆరుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది పుణ్యక్షేత్రంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు.

సమాచారం అందుకున్న గిద్దలూరు రూరల్ సీఐ జే. రామకోటయ్య, కొమరోలు ఎస్సై నాగరాజు తమ సిబ్బందితో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సమాచారాన్ని వారి బంధువులకు తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
