Cyclone | దిత్వా దూకుడు.. కర్నూలు గజగజ

Cyclone | దిత్వా దూకుడు.. కర్నూలు గజగజ

Cyclone | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : దిత్వా తుపాను ప్రభావంతో కర్నూలు జిల్లాలో ఇప్పటికే వాతావరణంలో మార్పు ప్రారంభమైంది. రాత్రివేళల్లో చల్లని గాలులు, పగటి పూట మేఘావృత వాతావరణం (Weather) కనిపిస్తోంది. జిల్లాలో పలుచోట్ల ఉదయం చినుకులు పడ్డాయి. దక్షిణ రాయలసీమ జిల్లాలతో పాటు కర్నూలులోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా.ఆదివారం, సోమవారం జిల్లాకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు సూచించారు.

రైతుల్లో ఆందోళన

మోంథా తుపాను దెబ్బ ఇంకా మానకముందే ‘దిత్వా’ హెచ్చరికతో కర్నూలు (Kurnool) రైతులలో తీవ్ర ఆందోళన నెలకొంది. జిల్లాలో వరికోతలు ఇంకా పూర్తిగా ముగియలేదు. సగటున 30–40 శాతం వరకూ మాత్రమే కోతలు పూర్తయ్యాయి.అనేకచోట్ల నూర్పిళ్లలో ధాన్యం ఆరబెడుతూ ఉండగా మళ్లీ వాతావరణం మారిపోవడంతో తేమశాతం పెరగనుందని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే మొంథా తుపాను కారణంగా ధాన్యంలోని తేమ 20 శాతం పైగా నమోదై కొనుగోళ్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూడా టార్పాలిన్ల కొరత, కూలీల లభ్యత సమస్య,ఆర్టీఎస్‌కే కేంద్రాల్లో సంచుల కొరత కనీస మద్దతు ధరలభించక జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

అధికారులు అప్రమత్తం

తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు అప్రమత్తంరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా యంత్రాంగం (mechanism) అప్రమత్తమైంది.తక్కువ ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశాలపై అధికారులు మునిసిపల్, పంచాయతీ సిబ్బందిని సిద్ధంగా ఉండమన్నారు. ఇక కోత దశలో ఉన్న పంటలను యథాశక్తి భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు.అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్‌రూమ్‌లు సిద్ధంగా ఉంచారు.

వెదర్ .. వార్నింగ్స్ ..

బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుపాను (Cyclone Ditva) వేగంగా ఉత్తర – వాయువ్య దిశగా కదులుతూ ఏపీ తీరాన్ని బెదిరుస్తోంది. గడచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న ఈ తుపాను ప్రస్తుతం చెన్నైకు 250 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 160 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరానికి సమాంతరంగా కదులుతున్న ఈ వాయుగుండం ఎప్పటికప్పుడు బలపడి, మరికొద్ది గంటల్లో ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు మరింత చేరువ కానుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టుకు మూడో ప్రమాద హెచ్చరిక, మిగతా అన్ని పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా, రాయలసీమ అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది.

జాగ్రత్తలు పాటించండి

కర్నూలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దు.విద్యుత్ తీగలు (Electrical wires) చెట్లు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలి.పంటలను ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్లతో కప్పేయాలి.నీరు నిలిచే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.తుపాను కర్నూలు మీదుగా పోకపోయినా, వర్షాలు మరియు గాలుల రూపంలో ప్రభావం తప్పకుంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.ప్రస్తుతం జిల్లా ప్రజలు, ముఖ్యంగా రైతులు, తమ పంటలతో సహా ఆస్తులను భద్రపరుచుకునే చర్యలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.