Mopidevi kattappa : ప్రైవేటు పంతులు కథండీ

Mopidevi kattappa : ప్రైవేటు పంతులు కథండీ

  • హెచ్ఎంకి బంట్రోతు
  • జీతభత్యాలూ ప్రైవేటే
  • స్కూలు బుడ్డోళ్లు..
  • ఆయనకు పశువులే
  • చితక బాధేస్తాడు
  • టీచర్లూ మాట్లాడరు
  • మోపిదేవీ హైస్కూలులో
  • నయా కట్టప్ప జమానా


Mopidevi kattappa | మోపిదేవి -ఆంధ్ర ప్రభ : సర్కారీ స్కూళ్లల్లో చదువు అబ్బటం లేదని.. పల్లెల్లోని అమ్మానాన్నలు తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్న రోజులివి. కూలీనాలీ జనం చదివించే స్థోమత లేక ప్రభుత్వ పాఠశాలల్లో తమ బిడ్డల్ని చదివిస్తుంటే.. ఓ సర్కారీ హైస్కూలు మహిష్మతి (Mahishmati) తన పాలక రక్షకుడిగా ఓ కట్టప్పను రంగంలోకి దించారు. ఇంకేముందీ ఈ కట్టప్ప చెలరేగిపోయాడు. మహారాణికి షాడో సామ్రాట్టుగా మారిపోయాడు. 25 మంది టీచర్లకు దిశ నిర్ధేశం చేస్తున్నాడు. పోతే పోనీ.. అని టీచర్లు సర్దుకుంటే.. ఇక స్కూలు బుడ్డోళ్లపై ఈ కట్టప్ప ప్రతాపం మితి మీరిపోయింది. దొరికినోళ్లను దొరికినట్టు గొడ్డును బాదినట్టు బాదేస్తున్నాడు. ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు బంట్రోతు ఆగడాలేంటీ అని ప్రశ్నించే నాథుడే ఇక్కడ లేడు. ఈ స్థితిలో శనివారం ఓ తొమ్మిద తరగతి విద్యార్థికి ఇతగాడు చుక్కలు చూపించగా.. ఆ బిడ్డ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇక హైస్కూలు హెడ్మాస్టారు, ఆమె బంట్రోతు మెడకు బుడ్డోడి ఉచ్చు బిగిసింది.

ఇంతకీ ..ఈ అహంకార కట్టప్ప కథ ఏమిటంటే..


కృష్ణాజిల్లా మోపిదేవిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 400 మంది పేదింటి బిడ్డలు చదువుతున్నారు. వీరికి 25 మంది టీచర్లు (Teachers) చదువు చెబుతున్నారు. ఇక ఇది సరే.. అకస్మాత్తుగా ఈ స్కూలుకు అనధికార బంట్రోటు ఊడి పడ్డాడు. ఇక అతడి ఆదేశాలతో,.. కనుసన్నల్లోనే టీచర్లు స్కూలుకు రావాలి. వెళ్లాలి. ఆయన ఏం ఆర్డరేస్తే ఆ పని చేయాలి. టీచర్ల సంగతి ఇలా ఉంటే.. విద్యార్థుల స్థితి దారుణం. ఆయన మిర్రున చూస్తే పిల్లల బట్టలు తడవాల్సిందే. లేదో వీపు విమానం మోత మోగుతుంది. శనివారం ఇలాంటి ఘటనే జరిగింది. ఈ స్కూల్లో 9 వతరగతి ఏ సెక్షన్ విద్యార్థి శనివారం సాయంత్రం సహ విద్యార్థులతో కలిసి తరగతి గది నుంచి బయటికి వచ్చాడు. ప్రైవేటు అధికారి శ్రీధర్ కు కోపం వచ్చింది. లోపలికి వెళ్లాలని హూంకరించాడు. ఆ అరుపులకు బిక్కచచ్చిన విద్యార్థి ఆయన ఆదేశానుసారం తరగతి గదిలోకి వెళ్లిపోయాడు. లోప కూర్చున్నాడు. ఆ తరువాత మళ్లీ విద్యార్థులు అదే రూమ్ నుంచి బయటకు వచ్చారు. 9 వతరగతి విద్యార్థి కూడా బయట రావడంతో.. ప్రైవేటు పాలకుడు శ్రీధర్ ఆగ్రహోగ్రుడయ్యారు. “ నీకు ఎన్నిసార్లు చెప్పాలి” అంటూ ఒక్కసారిగా వెదురు బొంగు కర్రతో విద్యార్థిని చితకబాదాడు. తోటి విద్యార్థులు చూస్తూ ఉండగానే క్రీడా మైదానం నుంచి కొట్టుకుంటూ క్లాసు వరకు తీసుకువెళ్లాడు, అని పాఠశాల విద్యార్థులు చెప్పారు.


శ్రీధర్ కొట్టిన దెబ్బలతో తీవ్ర గాయాలతో ఆ విద్యార్థి ఏడుస్తూ తన అమ్మానాన్నకు తెలిపాడు. వెంటనే తల్లిదండ్రులు మోపిదేవి పోలీస్ స్టేషన్ (Police Station) లో ఈ ప్రైవేటు పంతులుపై ఫిర్యాదు చేశారు. గాయపడిన బాలుడిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు చికిత్స చేశారు. 400 మంది పైగా విద్యార్థుల ఉన్న ఈ మోపిదేవి జిల్లా పరిషత్ హై స్కూల్ లో సర్కారు అటెండర్ ఉన్నా కూడా ఈ ప్రైవేటు పంతులు ఆజమాయిషీ ఏమిటని తల్లిందండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన సొంత డబ్బులతో ఈ ప్రైవేట్ పంతుల్ని నియమించారని జనం చెబుతున్నారు. పోలీసు కేసు వరకూ వెళ్లిన ఈ ఘటనలో రాజీకి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ప్రభుత్వం అనుమతి లేకుండా ఓ ప్రైవేటు వ్యక్తికి పాఠశాల నిర్వహణ బాధ్యతలు ఎలా అప్పగిస్తారు? ఇలా మితిమీరి వ్యవహరించవచ్చా? ఇంతకీ జిల్లా విద్యాశాఖ , జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో.. వేచి చూడకతప్పదు.

Leave a Reply