Palamaneru | పలమనేరు అడవిలో ఆవిష్కృతం..

Palamaneru | పలమనేరు అడవిలో ఆవిష్కృతం

  • ఏనుగుల కోసం 3 కిమీ అత్యాధునిక అండర్‌పాస్
  • సినిమా గ్రాఫిక్స్‌కి సవాల్‌ విసిరే పిల్లర్లు
  • అటవీ ప్రాంతంలో దేశాన్నే ఆశ్చర్యపరిచే నిర్మాణం

Palamaneru | చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : వాహనాల రాకపోకలకు బైపాస్‌లను చూసి ఉంటాం.. వాహనాలు రద్దీ అయితే పట్టణాల్లో, మహానగరాల్లో అండర్‌ బైపాస్‌లు కూడా చూస్తూనే ఉంటాం. కానీ అటవీ ప్రదేశంలో, అది కూడా మన ఏనుగుల కోసమే నిర్మిస్తున్న అండర్‌ బైపాస్‌.. వినగానే ఆశ్చర్యం, చూసే వారికి అబ్బో అనిపించే అద్భుత సాంకేతిక పరిజ్ఞానాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఎక్కడో కాదు..! చిత్తూరు జిల్లాలోని పలమనేరు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ అండర్‌ బైపాస్ నిర్మాణం నిజానికి అటవీ సంరక్షణలో ఓ మహత్తర ఘట్టం.

చిత్తూరు జిల్లాలో ఏనుగుల అడ్డాగా పలమనేరు రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రసిద్ధి. సుమారు 4 కిలోమీటర్ల మేర చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఈ అడవిని చీల్చుకుంటూ సాగుతుంది. చీకటి పడితే నెలకు కనీసం పది సార్లు గుంపులుగా కదులుతున్న ఏనుగులు వాహనదారులకు ఎదురవుతాయి. ఇది అలవాటైన దృశ్యమే కానీ, దారిని తెలియక వాహనాల మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఏనుగుల సంఖ్య మాత్రం వందల దగ్గరకు చేరింది.

ఏనుగుల సంచారం భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారవచ్చన్న ఆందోళనతో కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ హైవే డిజైన్‌ని ప్రభుత్వం, అటవీ శాఖలు సంయుక్తంగా పూర్తిగా మార్చేశాయి. పర్యావరణ సున్నిత జోన్‌గా గుర్తించిన కౌండిన్య, పలమనేరు అటవీ ప్రాంతాలను హైవే దాటుతుంది. ఏనుగుల మూడు ప్రధాన మార్గాల ద్వారా హైవేను దాటే అవకాశాలు ఉన్నాయి. వాటి మార్గాలకు ఎక్కడా ఇబ్బంది రాకుండా, ఏనుగుల సంచారానికి ఎక్కడా ఆటంకం కలగకూడదని భారత రహదారుల అభివృద్ధి సంస్థ అత్యాధునిక పద్ధతులను అనుసరించింది.

అటవీ శాఖతో సమగ్ర సర్వే తర్వాత ఏనుగుల అండర్‌పాస్‌లు మూడు ప్రదేశాల్లో నిర్ణయించబడ్డాయి. చిన్న జంతువుల కోసం మూడు బాక్స్ కల్వర్టులు, వాగులపై చిన్న వంతెనలు కూడా నిర్మిస్తున్నారు. వన్యప్రాణాలు ప్రశాంతంగా సంచరించేలా, భవిష్యత్తులో హైవే కారణంగా అడవిలో మార్పులు రావొద్దన్న ఉద్దేశంతో వన్యప్రాణి బోర్డు ప్రత్యేకంగా భారత రహదారుల అభివృద్ధి సంస్థకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. గత రెండేళ్లుగా తెల్లవారక ముందే పనివారితో అడవి ప్రాంతం కళకళలాడుతోంది. ఈ అటవీ ప్రాంతంలో 7.1 కిలోమీటర్ల మేర నిర్మాణం సాగుతున్నది. అందులో ఏనుగుల ప్రధాన కదలిక ఉన్న చోట మొత్తం 3 కిలోమీటర్ల మేర అండర్‌ బైపాస్ నిర్మిస్తున్నారు.

రాజుల కోటల పిల్లర్ల వంటి వైభవం..

మరి ఈ నిర్మాణం అంటే.. సినిమా కాకుండా నిజ జీవితంలో చూస్తే నమ్మలేనంత స్థాయి. పాతకాలంలో రాజులు కోటలు కట్టినప్పుడు పిల్లర్ల వైభవం ఎలా కనిపించేదో, నేటి కాలంలో బాహుబలి సినిమాలో కనిపించిన గ్రాఫిక్ ప్రాముఖ్యం ఎలా ఉందో ఆ రెండు మిళితమై ఇప్పుడు పలమనేరు అడవుల్లో ప్రత్యక్షమవుతున్నాయి. పిల్లర్లు అంత భారీగా, అంత అద్భుతంగా ఉండటంతో చూసేవాళ్లకి రెండు కళ్ళు సరిపోవు. ప్రకృతిలో ఇంత పెద్ద నిర్మాణం ఇంత అందంగా కలిసిపోతుందా అన్న సందేహమే వస్తుంది. ఉన్న పిల్లర్ల వివరాలు చూస్తే నిర్మాణం ఎంత శాస్త్రీయంగా తీసుకెళ్లారో అర్థమవుతుంది. మొత్తం ఐదు ప్రధాన పిల్లర్లపై ఆధారపడిన ఈ నిర్మాణం మొదటి పిల్లర్ 300 మీటర్ల దూరంలో, రెండవ పిల్లర్ 450 మీటర్లు, మూడవ పిల్లర్ 1400 మీటర్లు, నాల్గవ పిల్లర్ 650 మీటర్లు, ఐదవ పిల్లర్ 60 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఐదు భాగాలు కలిపి మొత్తం 3 కిలోమీటర్ల పొడవు. ఈ పిల్లర్ల ఎత్తు, వెడల్పు, టెక్నికల్ స్ట్రెంథ్ చూస్తే సాధారణ హైవే నిర్మాణాలకు మూడడుగులు ముందుంది. ఏనుగులు నిరభ్యంతరంగా ఈ మార్గం దాటేందుకు కావలసిన క్లియరెన్స్, వెడల్పు, చీకటి తక్కువగా ఉండేందుకు ప్రత్యేక లైటింగ్, వాతావరణం ప్రకారం గాలి ప్రసరణకు అన్ని ఏర్పాట్లు చేశారు.

ప్రకృతికి హాని లేకుండా అత్యధిక టెక్నాలజీతో..

అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్నప్పటికీ, ప్రకృతికి ఏమాత్రం హాని కలగకుండా ప్రతి అడుగు అటవీ శాఖ పర్యవేక్షణలోనే వేస్తున్నారు. మట్టిని తవ్వేప్పుడు కూడా అడవిలోని నేలపొరలకు నష్టం కలగకూడదని వేరే ప్రాంతాల నుండి మట్టి తెప్పిస్తున్నారు. అటవీ భూమిలో ఎలాంటి గుంతలు, తవ్వకాలు లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలో అత్యాధునిక ఏనుగుల అండర్‌పాస్‌లలో మొదటిది మధ్యప్రదేశ్‌.. రెండవది మన పలమనేరు అటవీ ప్రాంతంలో టెక్నాలజీ పరంగా, డిజైన్ పరంగా, అటవీ సంరక్షణ పరంగా పలమనేరు అండర్‌పాస్ దేశంలోనే ప్రత్యేకమైనదని సబ్ డీ.ఎఫ్.ఓ వేణుగోపాల్ గర్వంగా చెబుతారు. ప్రస్తుతం పలమనేరు అటవీ ప్రాంతంలో 100 నుండి 110 ఏనుగులు మాత్రమే ఉన్నాయి. వీటి సంతతిని పెంపొందించటం, భవిష్యత్తుకు రక్షితం చేయడం అందరి బాధ్యత. ఇదే దృష్టితో ఈ అండర్‌పాస్ నిర్మిస్తున్నారు. ఏనుగులు హైవేపైకి రాకుండా, వాహనాల మధ్య ప్రాణాలకు ముప్పు కలగకుండా, గ్రామాల్లోకి చొరబడే ప్రమాదాలు తగ్గించాలి అనే లక్ష్యంతో ఏనుగుల కోసం స్వతంత్ర మార్గం నిర్మించడం నిజంగా దేశానికే ఆదర్శం. మూడు నెలల క్రితం దారి తప్పి ఒంటరి ఏనుగు గ్రామంలోకి చొరబడిన సంఘటన, దానిని తరిమేందుకు ప్రయత్నించినప్పుడు ఫారెస్ట్ అధికారిపై జరిగిన తొక్కిసలాట ఘటన ఇవన్నీ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశాయి. రైతుల పంటలు నాశనం కావడం, గ్రామాల్లో భయం నెలకోవడం.. ఇవన్నీ భవిష్యత్తులో ఆగిపోవాలంటే ఈ అండర్‌పాస్‌లే ఒక్కటే పరిష్కారంమని భావించారు.

ఇది హైవే కాదు.. ఒక అద్భుతం..

పలమనేరు అటవీ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్న ఈ నిర్మాణం చూసినవాళ్లంతా ఇది హైవే కాదు.. ఇది ఒక అద్భుతం అని ముక్కున వేలేసుకుంటున్నారు. దేశంలో అడవి జంతువుల కోసం హైవే మార్గాలను నిర్మించిన అరుదైన ఉదాహరణల్లో పలమనేరు అండర్‌ బైపాస్ ఇప్పుడు ఒక గుర్తింపు. ప్రకృతిని ఆదరిస్తూ, అభివృద్ధిని ముందుకు నడిపే రెండింటినీ కలగలిపిన దారిగా ఇది నిలవనుంది. ఏనుగుల సంచారం ఇంకా శాంతంగా, స్వేచ్ఛగా సాగేందుకు ఈ అండర్‌పాస్ దీటుగా పనిచేస్తుంది. చూడటానికి అద్భుతం.. ఆలోచించడానికి ఆదర్శం.. ప్రకృతి, అభివృద్ధి సఖ్యతకు నిదర్శనం పలమనేరు ఏనుగుల అండర్‌బైపాస్ అని చెప్పక తప్పదు.

Leave a Reply