Praja Darbar | ప్రజల వద్దకే నేరుగా పాలన
Praja Darbar | నందిగామ, ఆంధ్రప్రభ : చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధికారులు కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు, వెంటనే పరిష్కార దిశగా చర్యలు చేపట్టేందుకు ఈ ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ప్రతి సమస్యకు తక్షణ స్పందన ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు అధికారులను నేరుగా ప్రజల వద్దకు తీసుకువస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు. సామాన్య మానవుడు ఎక్కడ ఇబ్బంది పడకుండా, సులభంగా తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాలను రెండు కళ్లుగా భావించి సమన్వయంతో పాలన సాగిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని మర్యాదపూర్వకంగా కలసి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వివరించారు.వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం, అడవి ఆవుల సమస్య, నియోజకవర్గంలోని వివిధ ఎత్తిపోతల పథకాలు, అలాగే రైతన్న పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబునాయుడు దృష్టికి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. వీటిపై అతి త్వరలోనే పురోగతి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజలతో ప్రభుత్వం – నేరుగా సంభాషణ
ప్రజా దర్బార్లో గ్రామస్తులు తమ సమస్యలను అధికారులకు తెలియజేయగా, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ప్రజలతో ప్రభుత్వం మధ్య నేరుగా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోటా వీరబాబు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ వాసిరెడ్డి ప్రసాద్, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

