Tirupati | రహదారులకు రాజయోగం
Tirupati | రహదారులకు రాజయోగం
- జిల్లాలో రోడ్ల అభివృద్ధికి రూ.15.20 కోట్లు
తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొత్తం రూ.15.20 కోట్ల వ్యయంతో 39.487 కి.మీ. పొడవున్న రహదారి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తిరుపతి, గూడూరు డివిజన్ల పరిధిలో ఆర్ అండ్ బీ శాఖ చేపట్టనున్న ఈ పనులపై కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం వివరాలు వెల్లడించారు.
గూడూరు డివిజన్లో ఈదులపల్లి – వీరంపల్లి రహదారి ఆధునికీకరించేందుకు రూ.2 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గూడూరు – తురిమెల్ల రహదారి అభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరు చేసినట్టు వివరించారు. ఈ రహదారుల్లో ట్రాఫిక్ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పనులు పూర్తి అయితే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆయన తెలిపారు.
ఏ రహదారికి ఎంతంటే!
తిరుపతి డివిజన్ పరిధిలో నాగలాపురం – చిన్నపాండూరు రహదారి మెరుగుదలకు రూ.11 కోట్లు కేటాయించారని కలెక్టర్ తెలిపారు. 19 కిమీ పొడవున విస్తరించిన ఈ మార్గం పలు గ్రామాలకు కీలక లింక్‌గా ఉండటంతో నాణ్యతతో పనులు చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. సూళ్లూరుపేట – సంతవేలూరు రహదారికి రూ.75 లక్షలు, శ్రీకాళహస్తి – ముసలిపేడు (వయా వేదం రామాపురం) రహదారికి రూ.40 లక్షలు కేటాయించినట్టు వెల్లడించారు. అలాగే, శ్రీకాళహస్తి – కాసారం – గొల్లగుంట రహదారిపై రెండు భాగాలుగా రూ.39 లక్షలు, రూ.36 లక్షలు చొప్పన కేటాయించి అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ఈ రహదారులన్నింటిని నూతన సాంకేతికతను వినియోగించి ప్రమాణాలతో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు.
