Nuzvidu | పీ-4 కార్యక్రమానికి బాసటగా నిలవాలి

Nuzvidu | పీ-4 కార్యక్రమానికి బాసటగా నిలవాలి
నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు రావాలి
నావంతు సాయంగా రూ 10 లక్షలు అందజేస్తాను…
గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
Nuzvidu | ఏలూరు / నూజివీడు, ఆంధ్రప్రభ బ్యూరో : నూజివీడు సబ్ కలెక్టర్ (Collector) కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నూజివీడు నియోజకవర్గ అభివృద్ధి కోసం పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టనర్ షిప్ ఫోరంలో వివిధ శాఖలు అధికారులు, బ్యాంకు అధికారులతో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీ-4 కార్యక్రమం అమలుపై సమీక్షించారు.
అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంగా అభివృద్ధిపథంలో నిలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలను మన రాష్ట్రంలో పెట్టుబాటులు పెట్టేందుకు ఆహ్వానిస్తూ, పరిశ్రమలు స్థాపనకు విశేష కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఇటీవల విశాఖపట్నంలో సీఐఐ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు స్పందించి 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. పరిశ్రమలు స్థాపనతో రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి బాటను పెట్టడంతోపాటు, రాష్ట్రంలోని యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు మెండుగా కలుగుతాయని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇష్టమైన పీ4 కార్యక్రమానికి మనమంతా బాసటగా నిలవాలని అన్నారు.

నూజివీడు నియోజకవర్గం అభివృద్ధికి పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు అధికారులు పెద్ద మనస్సుతో ముందుకు రావాలని కోరారు. అందరూ ముందుకు వస్తే తొలి నావంతు సాయంగా రూ.10 లక్షలు అందజేస్తానని అన్నారు. పోలీసు వ్యవస్థ పనితీరు అభినందనీయమని, దొంగతనం జరిగిన కొన్ని గంటలకే నగదును, బంగారాన్ని రికవరీ చేసి, దొంగలను (Thieves) అరెస్టు చేయటం జరుగుతుందని, ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాలు వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు పీ-4 ప్రారంభించామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు.
సమాజంలో సంపన్నులు (మార్గదర్శకులు) పేద, బలహీన వర్గాల వారిని (బంగారు కుటుంబాలు) దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా (Financially) ఎదుగుతారన్నారు. సమాజం ద్వారా సంపన్నులుగా ఎదిగిన వారు పేదలను ఆదుకోవడం ద్వారా సమాజ సేవ చేసిన వారవుతారన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే బంగారు కుటుంబాలు వారు మంచి జీవన ప్రమాణాలతో జీవనం సాగిస్తారన్నారు. పేదరికం లేని సమాజాన్ని తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేద్దామని అన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, పారిశ్రామికవేత్తలు, వివిధ శాఖలు అధికారులు, బ్యాంకు అధికారులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
