Development| సమగ్ర అభివృద్ధి దిశగా విజయవాడ..
- అభివృద్ధికి రూ. 2 వేల కోట్ల నిధులు
- తయారవుతున్న డీపీఆర్
- డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాం
- విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్
- రూ 93.08 లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దెతో శ్రీకారం
Development| ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: విజయవాడ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు అన్ని రూపొందిస్తున్నామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడలో రూ.93.08 లక్షలతో అభివృద్ది పనులకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి వర్షపు నీటి డ్రైను నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ లోని మెట్రోపాలిటన్ హోటల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాధ్ మాట్లాడుతూ.. అమరావతితో పాటు విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
విజయవాడ అభివృద్ధికి రూ. 2 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ అభివృద్దికి సంబంధించి త్వరలో డీపీఆర్ సిద్దం అవుతోందని, పూర్తి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. విజయవాడలో వర్షపు నీరు నిల్వ వుండకుండా డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. విజయవాడను పూర్తి స్థాయిలో 2029 కల్లా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడంతోపాటు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లకు కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి కృతజ్ఞతలు తెలిపారు.
