Tirupati | దివ్యదర్శనం..
Tirupati | దివ్యదర్శనం..
Tirupati, తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం ఉదయం ఏడు తలలు ఉన్న పెద్దశేషవాహనం పై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి (Srivari) దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనం పై భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహన సేవల్లో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జెఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కే.వి మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరింద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, పలువురు అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





