TET | పాఠాలు చెప్పాలా..? టెట్ పరీక్షకు సిద్ధమవ్వాలా..?

TET | పాఠాలు చెప్పాలా..? టెట్ పరీక్షకు సిద్ధమవ్వాలా..?
- సర్కారు టీచర్లకు గుదిబండలా టెట్ అర్హత నిబంధన
- రాష్ట్ర వ్యాప్తంగా 45, 742 మంది ఉపాధ్యాయులపై ప్రభావం
- తాము చెబుతున్న సబ్జెక్టు కాకుండా మరో సబ్జెక్టులో పరీక్ష రాయలేమని ఆవేదన
- 2010 తర్వాత నియమితులైన ఉపాధ్యాయులకే టెట్ అర్హతను పరిమితం చేయాలని డిమాండ్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లోని ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET 2025) గుది బండలా మారింది. పిల్లలకు పాఠాలు చెప్పాలో లేక టెట్‌లో అర్హత సాధించేందుకు పరీక్షకు సిద్ధమవ్వాలో తెలియక పంతుళ్లు పరేషాన్ అవుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. 2011కి ముందు డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు సర్వీస్‌లో కొనసాగాలంటే టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1వ తేదీన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. టెట్ అర్హత సాధించని ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులంతా రెండేళ్లలోపు టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని గడువు ఇచ్చింది.
అయితే అయిదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మాత్రం టెట్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వీనే పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ నిబంధనలు ఉపాధ్యాయులను కలవరపెడుతున్నాయి. ఉపాధ్యాయ ఉద్యోగంలో ఉన్నప్పటికీ తాజా నిబంధనల ప్రకారం TET క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో 45,742 వేల మంది టీచర్లు ఈ పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీచర్లకు TET టెన్షన్
అయితే, పరీక్షకు కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఉండటం, సిలబస్‌లో తాము బోధించని ఇతర సబ్జెక్టులు కూడా ఉండటంతో మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పరీక్షలకు కేవలం నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. జనవరి 16 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. పైగా, వీరు విధులు నిర్వహిస్తూనే ఈ పరీక్షకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. విధుల్లో ఆలస్యం, కుటుంబ బాధ్యతల మధ్య ఈ తక్కువ టైంలో క్వాలిఫై అయ్యేంతగా సిద్ధం కావడం కష్టమని పలువురు టీచర్లు వాపోతున్నారు.
విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. 2010 తర్వాత ఉపాధ్యాయ పోస్టులలో చేరిన వారంతా టెట్ ఉత్తీర్ణత సాధించి చేరిన వారే కావడం విశేషం. 2010 కంటే ముందు కేవలం డీఎస్సీ పరీక్షను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో ప్రతిభ కనబరచిన వారికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2027 ఆగస్టు 31వ తేదీలోపు వీరంతా TET ఉత్తీర్ణులు కావాల్సి ఉంది.

అయితే తాము బోధించే సబ్జెక్టుపై కాకుండా, ఇతర సబ్జెక్టుల సిలబస్‌ను ఎలా చదవడం అనే దానిపైనే ఉంది. ఉదాహరణకు, ఒక సోషల్ స్టడీస్ టీచర్ ఇప్పుడు గణితం, సైన్స్ లేదా భాషలకు సంబంధించిన బోధనా పద్ధతులు, కంటెంట్‌ను కూడా అధ్యయనం చేయాల్సి వస్తోంది. చాలా ఏళ్లుగా కేవలం తమ సబ్జెక్టుకే పరిమితమైన టీచర్లు, అనూహ్యంగా ఈ మొత్తం సిలబస్‌ను కవర్ చేయాల్సి రావడం వారిలో ఒత్తిడిని పెంచుతోంది. ‘మేము ఇన్నేళ్ల నుంచి ఒకే సబ్జెక్టు బోధిస్తున్నాం.
ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం టెట్ సిలబస్ చదవాలంటే ఎలా? మాకు కనీసం మూడు నెలల సమయమైనా ఇవ్వాలి. పైగా, ప్రస్తుతమున్న పాత సిలబస్ విధానం మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది’ అని పలువురు ఉపాధ్యాయులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. టెట్ అర్హత నిబందనతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లోని ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చట్టాన్ని పరిగణలోకి తీసుకొని ఇన్ సర్వీస్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ టెట్ ఉత్తీర్ణత సాధించాలని చెప్పడం సరికాదంటున్నారు.

టెట్ పరీక్ష ఉపాధ్యాయులకు గుడిబండగా మారిందని, పాతికేళ్లకు పైగా ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు ఇప్పుడు చదివి రాయాలంటే విద్యార్థుల భవిష్యత్ ఏమౌతుందో కనీసం పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇటు టెట్ పరీక్షకు చదవాలా? విద్యార్ధులకు చదువు చెప్పాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ సర్కారు టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఇన్ సర్వీస్ టీచర్లంతా టెట్ రాయాలా? వద్దా? అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి మినహాయింపు ఇస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి కావడంతో గతంలో డీఎస్సీ ద్వారా నియమితులై, టెట్ నుంచి మినహాయింపులేని టీచర్లు అంతా దీని పరిధిలోకి వస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 45,742లుగా ఉన్నది. వీరంతా టెట్ క్వాలిఫై కాకపోతే వారి సర్వీస్ విషయం లేదా ప్రమోషన్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో 2010 ఆగస్టు 23 తర్వాత నియమితులైన టీచర్లకు మాత్రమే టెట్ తప్పనిసరి చేయాలని, అంతకుముందు నియమితులైన వారికి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
