వర్తక సంఘం ఎన్నికల్లో.. వైశ్యులదే హవా..!

  • అధ్యక్షుడిగా కురువెల్ల ప్రవీణ్ కుమార్
  • ప్రధాన కార్యదర్శిగా సోమా నరసింహారావు
  • కోశాధ్యక్షులుగా తల్లాడ రమేష్
  • రాత్రి 11 గంటల వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు

ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ : చారిత్రక నేపథ్యం కలిగిన ఖమ్మం వర్తక సంఘం ఎన్నికల్లో వైశ్య అభ్యర్థులదే హవా కొనసాగింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు కురువెల్ల ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడిగా ప్రత్యర్థి మేళ్లచెరువు వెంకటేశ్వరరావు పై సంచలన విజయం సాధించారు.

కురువెల్ల ప్రవీణ్ కుమార్ కు 725 ఓట్లు రాగా, మేళ్లచెరువు వెంకటేశ్వరరావుకు 506 ఓట్లు రావడంతో 219 ఓట్ల మెజార్టీతో గెలుపు ఖరారైంది. చివరి వరకు సస్పెన్స్ గా మారిన ఈ ఎన్నికల్లో కురువెల్ల, మేళ్లచెరువు ప్యానెల్స్ పోటా పోటీగా హోరెత్తించే రీతిలో ప్రచారం నిర్వహించగా, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు ఓటమి చెందినప్పటికీ ఆయన ప్యానల్ కే మెజార్టీ పోస్టులు దక్కాయి.

ప్రధాన కార్యదర్శిగా మేళ్లచెరువు ప్యానెల్ కు చెందిన సోమ నరసింహారావు( జీ వై నరేష్) కురువెల్ల ప్రవీణ్ కుమార్ ప్యానెల్ కు చెందిన గొడవర్తి శ్రీనివాసరావు పై 86 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సోమా నరసింహారావుకు 683 ఓట్లు రాగా, గొడవర్తి శ్రీనివాసరావుకు 597 ఓట్లు వచ్చాయి.

అదేవిధంగా కోశాధ్యక్ష పదవికి మేళ్లచెరువు వెంకటేశ్వరరావు ప్యానల్ నుండి తల్లాడ రమేష్ ప్రత్యర్థి కురువెల్ల ప్రవీణ్ కుమార్ ప్యానల్ కు చెందిన తూములూరి లక్ష్మీనరసింహారావు పై 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక పదవులు వైశ్య సామాజిక వర్గానికే దక్కడంతో ఆసక్తికరంగా మారి చర్చకు దారితీసింది. ఫలితాలు వెల్లడైన అనంతరం గెలుపొందిన అభ్యర్థులు టపాసులు పేల్చి రంగులు చల్లుకొని సంబరాలు చేశారు. ఎన్నికల అధికారి పిబి శ్రీరాములు సారధ్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.

Leave a Reply