ఇసుక లారీల మాఫియా విధ్వంసం..

- ప్రజల ప్రాణాల విలువ లేదా?
ఏటూరు నాగారం, ఆంధ్ర ప్రభ : ఇసుక అక్రమ రవాణా చేసే లారీల విధ్వంసం కారణంగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గత రెండు రోజుల్లో జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందగా, మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. అక్రమార్కుల స్వార్థం కోసం ప్రజలు బలి అవుతుంటే, ఆర్టీవో, పోలీసులు అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ నరకం…
గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై ఇసుక లారీలు కిలోమీటర్ల మేర పార్కింగ్ చేయడంతో రోజూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో వృద్ధులు, విద్యార్థులు, చిన్న పిల్లలు నడవలేక, వాహనాల్లో ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రధాన రహదారిపై ఇన్ని లారీలకు పార్కింగ్ అనుమతి ఎవరు ఇచ్చారు? రోడ్లపై లారీలు పార్క్ చేస్తుంటే సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయని గ్రామస్తులు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
తాజా ప్రమాదాల్లో ప్రాణ నష్టం..
నిన్న రాత్రి కమలాపూర్ వద్ద జరిగిన ప్రమాదంలో వేగంగా దూసుకొచ్చిన ఇసుక లారీ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు రోజుల ముందు తాడ్వాయి వద్ద ఒక ద్విచక్ర వాహనాన్ని ఇసుక లారీ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ తరహా ప్రమాదాల వల్ల కొందరు ప్రాణాలు కోల్పోవడమే కాక, అనేక మందికి శాశ్వత వైకల్యం ఏర్పడుతోంది.
అధికారులు కొమ్ముకాస్తున్నారా?
ఈ అక్రమాలను అరికట్టాల్సిన బాధ్యత గల ఆర్టీవో అధికారులు, పోలీసులు నిత్యం ఈ మార్గంలో లారీలు వెళ్తున్నా, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తున్న ఆ అధికారులు ఎవరు? వారి అండదండల వల్లే ఈ అక్రమార్కులు యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, అక్రమ రవాణాను ఆపి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
