వర్షపు నీటిని ఒడిసి పడదాం..
జీవనాధారం పెంచుదాం..!
కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని
గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : వర్షపు నీటిని ఒడిసి పడదాం.. జీవనాధారం పెంచుదామని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ (Dr.Pemmasani Chandrasekhar) పిలుపునిచ్చారు. వాటర్ షెడ్ మహోత్సవ్ పై రెండు రోజుల జాతీయ సదస్సు గుంటూరు వెల్కమ్ గ్రాండ్ హోటల్లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంచి పథకాలు అమలు చేస్తుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి విజన్ తో ఆ పథకాలను చక్కగా ఉపయోగించుకుని దేశంలోనే ఆదర్శంగా నిలబడాలనే ఆశయంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. అభివృద్ధికి మన రాష్ట్రం, మన ప్రాంతం నుండి మంచి భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తున్నానని తెలిపారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టి అభివృద్ధికి, జీవనోపాధికి అడుగులు వేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్స్యూరింగ్ వాటర్ సెక్యూరిటీ, నర్చరింగ్ వేస్ట్ లాండ్, ఎంపవరింగ్ రూరల్ లైవ్లి హుడ్స్ రాజస్థాన్ అనే పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ నితిన్ కడే, రాష్ట్ర పంచాయతీ రాజ్ సంచాలకులు ఎం. కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, తదితరులు పాల్గొన్నారు.

