పత్తి రైతు సమస్యలపై ఇల్లు ముట్టడి..

పత్తి రైతు సమస్యలపై ఇల్లు ముట్టడి..
- బీఆర్ఎస్ శ్రేణుల బైటాయింపు.. ఉద్రిక్తత…
- మాజీమంత్రి జోగు రామన్న అరెస్ట్…
ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : మార్కెట్ లో పత్తి తేమశాతం ఆంక్షలు విధిస్తూ.. ఎకరాకు కొనుగోళ్ల పరిమితిని 7.75 క్వింటాళ్లకు కుదించడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఈ రోజు ఆదిలాబాద్లో(Adilabad) చేపట్టిన ఆందోళన కాస్త ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్(Cotton Corporation) పత్తి రైతుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహిస్తూ మాజీమంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎంపీ గోడం నగేష్ ఇంటిని ముట్టడించారు.
నగేష్ నివాస గృహం ముందు బైటాయించి కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఎండ గట్టారు. పత్తిలో తేమశాతం పేరిట కొర్రీలు విధించడంతో రైతులు పండించిన పత్తి పంటను తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. ఎంపీ నగేష్ రాజీనామా చేయాలని, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు చెదరగొట్టేందుకు ప్రయత్నించగా తోపులాటల మధ్య ఉద్రిక్తత నెలకొంది.
మాజీ మంత్రి జోగు రామన్న అరెస్ట్.. రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలింపు..
ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి సందర్భంగా తోపులాటలో బిఆర్ఎస్ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. డీఎస్పీ జీవన్ రెడ్డి(DSP Jeevan Reddy), సీఐ సునీల్ కుమార్, పోలీసులు అక్కడికి చేరుకొని మాజీ మంత్రి రామన్నను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు కార్యకర్తలు అడ్డుపడడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. అనంతరం జోగు రామన్నను రూరల్ పోలీస్ స్టేషన్ కు, పార్టీ కార్యకర్తలను వన్ టౌన్ స్టేషన్ కు తరలించారు.
పత్తి రైతుల గోస పట్టించుకోవడం లేదు..!
భారీ వర్షాలు, ఇటీవల కురిసిన ముంత తుపాను ప్రభావంగా పత్తి పంట దిగుబడి అమాంతం తగ్గిందని, మార్కెట్లో గిట్టుబాటు ధర కూడా రావడం లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. 8 నుండి 12 శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే సీపీఐ కొనుగోలు చేస్తోందని, ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టపోయిన రైతుల(affected farmers)ను ఆదుకోవాల్సిన బాధ్యత మర్చిపోయిందని విమర్శించారు. 25 శాతం తేమ ఉన్న పత్తిని కూడా మార్కెట్లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.


కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి సోయా, మొక్కజొన్న రైతులను దగా చేస్తోందని విమర్శించారు. గత ఏడాది పత్తి ఎకరాకు 13 క్వింటాళ్ల పరిమితితో కొనుగోలు చేస్తే, ఈసారి తేమశాతం(humidity) ఆంక్షలతో పాటు 7.7 క్వింటాల్ల పత్తి మాత్రమే కొనుగోలు చేయడం దారుణం అన్నారు. బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే పత్తి రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం లేదని ధ్వజమెత్తారు. ఎంపీ ఇంటి ముట్టడి ఆందోళన కార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు గంట రమేష్, జగదీశ్వర్, అజయ్, పవన్ జాదవ్, జంగిలి ప్రశాంత్, శివ తదితరులు పాల్గొన్నారు. రూరల్ సీఐ ఫణిదర్ ఆందోళనకారులపై కేసులు నమోదు చేశారు.
