తేలాల్సింది ఇంకెంత…?

మొంథా తుఫాను కారణంగా తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,47,864 ఎకరాల్లో సాగు చేసిన పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. ఈ తుఫాను కార‌ణంగా 12 జిల్లాల్లోని 179 మండలాల్లోని 2,53,033 మంది రైతులు ప్రభావితమయ్యారు.

ప్రాథమిక అంచనాలో, అత్యధికంగా 2,82,379 ఎకరాల్లో వరి పంట, ఆ తర్వాత 1,51,707 ఎకరాల్లో పత్తి పంటకు భారీ నష్టం వాటిల్లినట్లు తేలింది. జిల్లా స్థాయి నష్టాన్ని పరిశీలిస్తే, వరంగల్‌లో 1,30,200 ఎకరాలు, ఖమ్మంలో 62,400 ఎకరాలు, నల్గొండలో 52,071 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇవి ప్రాథమిక అంచనాలు మాత్రమేనని, పూర్తిస్థాయి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత నష్టం పరిమాణం మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. “ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలుస్తుంది. నష్టపరిహారం (ఎకరాకు ఎంత) అనే అంశంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటారు” అని ఆయన రైతులకు హామీ ఇచ్చారు.

తుఫాన్ ధాటికి పంట నష్టపోయిన రైతుల దుస్థితి హృదయాన్ని కలచివేస్తోంది. కరీంనగర్ మార్కెట్ యార్డ్‌లో ఓ మహిళా రైతు “ఆరు నెలల శ్రమ మొత్తం ఒక్క వర్షానికి కొట్టుకుపోయింది” అంటూ కన్నీరుమున్నీరుగా విలపించడం, అధికారులను సహాయం కోసం కాళ్లపై పడి వేడుకోవడం కనిపించింది.

ఈ నేపథ్యంలో, ప్రభుత్వం వ్యవసాయ, రెవెన్యూ విభాగాల అధికారులను అప్రమత్తం చేసి, నష్టం అంచనా సర్వేలను వేగవంతం చేయాలని ఆదేశించింది. తుఫాన్ బారిన పడిన రైతులకు సత్వరమే నష్టపరిహారం అందించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.

Leave a Reply