వరద ప్రాంతాల్లో నంద్యాల స్వీయ పర్యవేక్షణ

వరద ప్రాంతాల్లో నంద్యాల స్వీయ పర్యవేక్షణ
నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : మొంథా తుఫాన్ ప్రభావంతో నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని నల్లమల్ల అడవులలో విస్తారంగా వర్షాలు కురవడంతో సిద్దాపురం చెరువు అలుగు ఉధృతంగా ప్రవహించడంతో దోర్నాల ఆత్మకూరు మధ్య రాకపోకలు అంతరాయం ఏర్పడింది. జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షేరాన్ తక్షణం స్పందించారు.
ఆత్మకూరు నుంచి దోర్నాల మీదుగా విజయవాడ వెళ్లే వాహనాలను నంద్యాల గిద్దలూరు మీదుగా మళ్లించారు. ఎస్పీ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా వర్షానికి వడ్ల రామాపురం గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ ప్రత్యామ్నాయ మార్గాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని ఎస్పీ పోలీసులను ఆదేశించారు.
ఎస్పీ సిద్దాపురం చెరువు ,వడ్ల రామాపురం , భవనాసి వాగు ఆత్మకూరు టౌన్ లో వరద ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని పర్యవేక్షించారు. వరద ఉధృతిని అంచనా వేయటానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
స్వయంగా డ్రోన్ ను ఎగరవేసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం ఎస్పీ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ కు చేరుకొని విధి నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఆత్మకూరు డీఎస్పీ రామంజి నాయక్ సీఐలు రాము, సురేష్ కుమార్ రెడ్డి, పాల్గొన్నారు.

