అసలు ఏం జరిగింది..?

అసలు ఏం జరిగింది..?
బాపట్ల టౌన్, అక్టోబర్ 29, ఆంధ్రప్రభ : ఏపీఎస్డిఎంఏ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్ వి. వినోద్ కుమార్ (Collector V.Vinod Kumar) నిద్రలేని రాత్రులు గడిపారు. జిల్లా ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో గంట గంటకు 440 పునరావస కేంద్రాల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పునరావాస కేంద్రాల పరిశీలన యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టారు. మంగళవారం రాత్రి 1. 30 నిమిషాలకు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నేరుగా పురపాలక కార్యాలయాన్ని సందర్శించారు. తుఫాను విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అప్రమత్తం చేశారు. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రాణ నష్టం జరగకుండా చూశారు. కొంతమేర ఆస్తి నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి 7 గంటల నుండి జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తూ దుకాణాలను మూసేయించారు.
జాతీయ రహదారి (National Highway) పై వాహనాలను పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో నిలుపుదల చేయించారు. ముందుగానే కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని వ్యాపార ప్రకటన హోర్డింగులు తొలగించడం ద్వారా కొంతమేర ప్రజలకు ఆస్తి నష్టం జరగకుండా చూశారు. బాపట్ల పట్టణంలోని పురపాలక కమిషనర్ జి రఘునాథరెడ్డి ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ రోడ్లు పక్కన ఉన్న చెట్లను తొలగించారు. లోతట్టు ప్రాంతాలలో నిలచి ఉన్న వర్షపు నీరును మోటర్ల సాయంతో బయటికి కాలువల ద్వారా పంపించారు. సముద్ర తీర గ్రామాల రాకపోకలకు అంతరాయం కలిగే విధంగా సూర్యలంక రహదారిలో సప్త పై వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఆర్డిఓ గ్లోరియా, ఎమ్మార్వో సలీమా ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి యుద్ద ప్రాతిపదికన పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బందికి నీరు తరలింపు చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. కర్లపాలెం మండలంలో ఒక వృద్ధుడు, దీర్ఘకాలిక వ్యాధితో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక మహిళ మృతి చెందినట్లు తెలిసింది.

