లిక్కర్ మాఫియాపై కఠిన చర్యలు తప్పవు

లిక్కర్ మాఫియాపై కఠిన చర్యలు తప్పవు

  • జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు భారీ లబ్ది
  • రాయలసీమను రత్నాల సీమగా తీర్చిదిద్దుతాం
  • మంత్రి నిమ్మల రామానాయుడు

(కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ) : రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకు పునాది వేసి, దానిని పెంచిపోషించింది గత జగన్ ప్రభుత్వం అని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కర్నూలులో శనివారం జరిగిన సూపర్ జీఎస్టీ – సూపర్ సక్సెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మంత్రి మాట్లాడుతూ… చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లిక్కర్ మాఫియాను వెలికి తీసి అరికట్టే దిశగా కఠిన చర్యలు తీసుకుంటోంది. గత ప్రభుత్వం కల్తీ మద్యాన్ని తయారు చేసి, డిస్ట్రిలరీల ద్వారా సరఫరా చేసింది. ఇప్పుడు అటువంటి అక్రమాలకు తావు ఉండదు” అని స్పష్టం చేశారు.

జీఎస్టీ తగ్గింపు (GST deduction) వల్ల ఒక్కో కుటుంబానికి రూ.25 వేల నుండి రూ.40 వేల వరకు లబ్ది చేకూరుతుందని మంత్రి వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులకు ఏటా రూ.2.5 లక్షల కోట్ల వరకు ఆదా అవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుంది. ఆరోగ్య భీమా, ఇన్సూరెన్స్ సేవలు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. మందులు, వైద్య సేవలు తక్కువ ధరకే అందుతాయి అని వివరించారు.

రైతులు (Farmers) పెద్దఎత్తున లాభపడతారని నిమ్మల పేర్కొన్నారు. “ఒక ఏడాదికే కూటమి ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేసింది. ఆటో డ్రైవర్‌లకు ఏడాదికి రూ.15 వేలు, రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. పేదలకు భరోసా కల్పించడం మా ప్రభుత్వం లక్ష్యం అన్నారు.

మంత్రి పేర్కొంటూ, అమరావతి నిర్మాణం (Amaravati construction) మళ్లీ వేగం అందుకుంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. రాయలసీమను రత్నాల సీమగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది” అని అన్నారు. సూపర్ జీఎస్టీ కార్యక్రమం సూపర్ సక్సెస్ అవుతుంది. ప్రజలందరూ ఈ మార్పు ఫలితాలను అనుభవిస్తారు.