ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్…

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం రాష్ట్ర ఆర్థిక పురోగతికి, మౌలిక వసతుల అభివృద్ధికి కీలకమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.

రాష్ట్రంలో సుమారు రూ.1.17 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, దీని ద్వారా సుమారు 70 వేల ఉద్యోగాలు లభిస్తాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. గత 15 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం రూపొందించిన వివిధ పాలసీలకు అనుగుణంగా ఈ ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

అతిపెద్ద విదేశీ పెట్టుబడి…

కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన అత్యంత కీలక నిర్ణయం విశాఖపట్నంలో రైడెన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటవబోతున్న హైపర్‌స్కేల్ డేటా సెంటర్ కు సంబంధించినది. ఈ ప్రాజెక్టుకు కేబినెట్ రూ. 87,520 కోట్ల భారీ పెట్టుబడిని ఆమోదించింది. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (FDI) ఒకటిగా నిలవనున్నది, అని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

ఈ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారుతుందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఒకే ఈ ప్రాజెక్ట్ ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతాయని ఆయన తెలిపారు.

ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల మరో 26 ప్రాజెక్టులకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇవి మొత్తం రూ. 27,304 కోట్లు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఈ వివరాలను కూడా మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

రాజధానిపై ఫోక‌స్

రాజధాని అమరావతి అభివృద్ధిపై కేబినెట్ ప్రత్యేక దృష్టి సారించింది. కృష్ణా నది ఒడ్డున ఏర్పాటు చేయనున్న అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్‌లో గవర్నర్ రాజ్‌భవన్ నిర్మాణానికి రూ. 212 కోట్లు కేటాయించారు. అలాగే, క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ)కు మొత్తం రూ.14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది.

ఈ నిధులలో 25% (సుమారు రూ.3,706 కోట్లు) మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌లలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థల నిర్మాణానికి ఉపయోగించనున్నారు, దీని ద్వారా 1.5 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. రాజధానిని టెక్నాలజీ హబ్‌గా మార్చే ప్రయత్నాల్లో భాగంగా, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

దీనికి సీఆర్‌డీఏను ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా నియమించారు. అంతేకాకుండా, గ్రీన్-సర్టిఫైడ్ భవనాలుగా నాలుగు కొత్త కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఉద్యోగులకు శుభవార్త..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ను 4% పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. దీపావళి పండుగకు ముందు ఈ పెంపు ప్రయోజనం అందించాలని నిర్ణయించారు.

ఇతర కీలక నిర్ణయాలు:

  • కర్నూలు జిల్లాలో రిలయన్స్ కన్సూమర్ ప్రాడక్ట్‌ల ఫ్యాక్టరీ నెలకొల్పడానికి రూ.758 కోట్ల పెట్టుబడితో కూడిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనికోసం 120 ఎకరాల భూమిని కేటాయించారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
  • టూరిజం పాలసీని ‘గేమ్ ఛేంజర్’గా అభివర్ణించిన కేబినెట్, పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సిల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. దస్ పల్లా అమరావతి ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించింది.
  • ట్రైబల్ ఏరియాల్లోని భూములను టూరిజం కోసం అభివృద్ధి చేయడానికి, స్థానిక గిరిజనులకు 50 శాతం భాగస్వామ్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
  • టాటా పవర్ రెన్యూవబుల్ లిమిటెడ్ ప్లాంటు, చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
  • విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు తోటపల్లి బ్యారేజి నుంచి 24 ఎంసీఎం నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.
  • ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద బీడీఎల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 317 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఓకే చెప్పింది.
  • ఆర్టీసీ బస్సులన్నింటినీ వచ్చే మూడేళ్లలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
  • పంచాయతీ సెక్రటరీల హోదాను పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్లుగా పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.