తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : దేశంలోని మధ్యప్రదేశ్ లో చిన్నారుల వరుస మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ కఫ్ సిరప్‌పై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. రాష్ట్రంలో ఈ సిరప్ వాడకంపై నిషేధం విధిస్తూ, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తక్షణమే అమలు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేక హెచ్చరికను జారీ చేసింది. ఈ నిర్ణయం ఒక ముందస్తు జాగ్రత్త చర్యగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎవరి వద్దనైనా ఈ సిరప్ నిల్వ ఉంటే, వారు వెంటనే స్థానిక డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. ప్రజలు నేరుగా DCA, తెలంగాణకు కూడా రిపోర్ట్ చేయవచ్చు అని తెలిపారు. ఇందుకోసం టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ను ఏర్పాటు చేశారు.
మార్కెట్లో నిల్వ ఫ్రీజ్
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అన్ని డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, రిటైలర్లు, ఆసుపత్రులకు తక్షణమే హెచ్చరికలు పంపి, మార్కెట్లో ఉన్న ఈ సిరప్ బ్యాచ్ నిల్వను ఫ్రీజ్ చేయాలని సూచించారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని DCA డైరెక్టర్ జనరల్ షాహ్నవాజ్ కాసిం, IPS తెలియజేశారు. పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ హెచ్చరికను తప్పక పాటించాలని, జాగ్రత్తగా ఉండాలని DCA కోరింది.

