కళ్యాణలక్ష్మి పథకం కొనసాగించాలి..

భూత్పూర్‌లో బీఆర్‌ఎస్‌ ఆందోళన

భూత్పూర్, ఆంధ్రప్రభ : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలంటూ భూత్పూర్‌లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పథకాలను ఎత్తివేసే ప్రయత్నాలను నిరసిస్తూ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆల ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భరోసాగా నిలిచాయని ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. లక్షలాది కుటుంబాలు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాయని తెలిపారు. ఎన్నికల సమయంలో తులం బంగారం అదనంగా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్నే ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఒక్క దేవరకద్ర నియోజకవర్గంలోనే సుమారు 9 వేల మంది ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశామని గుర్తుచేశారు.

పేద కుటుంబాలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పథకాలను ప్రభుత్వం తక్షణమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బస్వరాజు గౌడ్, సర్పంచులు ఆల శ్రీకాంత్‌రెడ్డి, నట్టి సురేష్, కౌన్సిలర్ గడ్డం ప్రేమ్‌కుమార్, నాయకులు నారాయణ గౌడ్, మనమోని సత్యనారాయణ, మురళీధర్ గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణ, అశోక్ గౌడ్, ఫసియోద్దీన్, రాము నాయక్, ఆంజనేయులు నాయక్, నెల్లి నర్సింహులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.