పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తులు
శ్రావణ తొలి సోమవారం, నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు
పాలకుర్తి, ఆంధ్రప్రభ: శ్రావణ మాస తొలి సోమవారం, నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తిలోని హరిహర క్షేత్రం శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు స్వామివారికి పంచామృత అభిషేకాలు, పుష్పార్చనలు నిర్వహించారు. ప్రత్యేక అష్టోత్తర శతనామావళి, గోత్రనామార్చన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తూ తీర్థప్రసాదాలను అందించారు.
నాగుల పంచమి సందర్భంగా ఆలయ సమీపంలోని నాగేంద్రస్వామి వద్ద భక్తులు పాలాభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి తమ కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నాగేంద్రస్వామిని వేడుకున్నారు. శ్రావణ తొలి సోమవారం, నాగుల పంచమి ఒకేసారి రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
