పంద్రాగస్టున‌ ప‌డిక్క‌ల్ హిస్ట‌రీ..

ఆంధ్ర‌ప్ర‌భ : భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత సాధించాడు. ఆగస్టు 15న శ్రీలంకతో గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున టెస్టు సెంచరీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ చరిత్ర సృష్టించాడు.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 140 బంతుల్లో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. కీలక సమయంలో సంయమనంతో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. తన కెరీర్‌లోనే కాకుండా భారత క్రికెట్ చరిత్రలోనూ గుర్తుండిపోయే మైలురాయిని అందుకున్నాడు.

అయితే, ఇదే సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన అరుదైన రికార్డు మరోసారి చర్చకు వచ్చింది. గణతంత్ర దినోత్సవం (జనవరి 26), స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీలు సాధించిన ఏకైక భారత ఆటగాడిగా కోహ్లీ కొనసాగుతున్నాడు.

2012 జనవరి 26న ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 116 పరుగులతో శతకం సాధించాడు. ఆ రోజు గణతంత్ర దినోత్సవం కావడం విశేషం. 2019 ఆగస్టు 15న వెస్టిండీస్‌తో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 114 పరుగులతో అజేయ సెంచరీ నమోదు చేశాడు. మ్యాచ్ ఆగస్టు 14న ప్రారంభమైనప్పటికీ వర్షం కారణంగా ఆలస్యమై, భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 తెల్లవారుజామున కోహ్లీ శతకం పూర్తి చేశాడు. ఇప్పుడు దేవదత్ పడిక్కల్ కూడా ఆగస్టు 15న టెస్టు సెంచరీ సాధించి ఈ ప్రత్యేకమైన రోజును భారత క్రికెట్ చరిత్రలో మరోసారి గుర్తుండిపోయేలా చేశాడు.