Ap-Cm-Bus-Travel-Shg : చెల్లెమ్మ‌ల‌తో చంద్ర‌న్న Andhra Prabha Top Story

Ap-Cm-Bus-Travel-Shg : చెల్లెమ్మ‌ల‌తో చంద్ర‌న్న Andhra Prabha Top Story

  • బ‌స్సులో మాటా మంతీ
  • క్రమశిక్షణలో దేశానికే ఆదర్శం
  • డ్వాక్రా మహిళలకు కితాబు
  • గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్ ల్ని త‌రిమేద్దాం
  • రాజకీయ నేర‌స్తుల్ని దూరం పెట్టాలి*
  • స్త్రీ శక్తికి సంవత్సరం
  • రెట్టింపు ఆత్మగౌరవం
  • కార్యక్రమంలో ఏపీ సీఎం సీబీఎన్

(ఆంధ్ర‌ప్ర‌భ‌, అమరావతి)

మహిళల ఆర్థిక సాధికారతే కుటుంబాల అభ్యున్నతికి మార్గమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళల ఆదాయం పెరగాలని.. ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని.. అప్పుడే కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుందని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల స్థితిగతులను తెలుసుకుని, బాగా వెనుకబడిన కుటుంబాలను ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘స్త్రీ శక్తికి సంవత్సరం-రెట్టింపైన ఆత్మగౌరవం’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అమరావతి పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం.. తన క్యాంప్ కార్యాలయంలో తేనేటీ విందు ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ చదువుకుంటే మెరుగైన ఆలోచనలు వస్తాయని.. మంచి ఆలోచనలు వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని సీఎం అన్నారు. అందుకే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్యం మెరుగుపడేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని.. ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్య అలవాట్లపైనా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సంజీవని వంటి కార్యక్రమాలతో ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నామని చెప్పారు. మహిళలను ఒకప్పుడు చిన్నచూపు చూసేవారని… ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చంద్రబాబు అన్నారు. మహిళలే ఎక్కువగా సంపాదించే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. డ్వాక్రా ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని అన్నారు. దీనికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు ఉద్యమానికి తానే శ్రీకారం చుట్టాననే విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం డ్వాక్రా సంఘాల ద్వారా సుమారు రూ.25 వేల కోట్ల పొదుపు సొమ్ము బ్యాంకుల్లో ఉందని తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మహిళలు క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నారని ప్రశంసించారు. కొన్ని పెద్ద కంపెనీలు కూడా రుణాలు ఎగవేస్తున్న పరిస్థితుల్లో.. డ్వాక్రా మహిళలు మాత్రం తీసుకున్న రుణాలను ఠంచనుగా చెల్లిస్తున్నారని కొనియాడారు. పీ4 విధానం ద్వారా పేద కుటుంబాలకు చేయూతనిస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

Ap-Cm-Bus-Travel-Shg :అను నేను’ సంకల్పంతో ..

ప్రతి ఒక్కరూ ‘అను నేను’ అనే సంకల్పంతో తమ కుటుంబాన్ని, తమ గ్రామాన్ని, తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్న సంతృప్తితో ఆగిపోకుండా.. వాటిని ఆధారంగా చేసుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాల్లో మరింత ముందుకు రావాలని సీఎం ఆకాంక్షించారు. రౌడీయిజం, ఫ్యాక్షనిజాన్ని నియంత్రించామని.. ఇప్పుడు గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. గంజాయి నిర్మూలనకు డ్వాక్రా సంఘాలు చొరవ తీసుకోవాలని సూచించారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారిని మహిళలు ఒక కంట కనిపెడుతూ ఉండాలని అన్నారు. రాజకీయాలను అడ్డం పెట్టుకుని సమాజంలో అశాంతి సృష్టించే వారిని దూరంగా పెట్టే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Ap-Cm-Bus-Travel-Shg : బ‌స్పు ఖ‌ర్చుల్లేవ్ ..

గతేడాది ఆగస్టు 15న ప్రారంభించిన స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రోజుకు సుమారు 24 లక్షల ప్రయాణాలు జరుగుతున్నాయని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు తమ డబ్బును ఆదా చేసుకుంటున్నారని.. ఆ మొత్తాన్ని కుటుంబ అవసరాలకు, వ్యాపారాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందని సీఎం అన్నారు. స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలకు ప్రయాణ స్వేచ్ఛతో పాటు ఆర్థిక స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం పెరిగాయని చెప్పారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది అయిన సందర్భంగా స్త్రీ శక్తికి సంవత్సరం… రెట్టింపైన ఆత్మవిశ్వాసం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. రాజధానిలో జెండావిష్కరణ తర్వాత అమరావతి పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయం వరకు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం మహిళలకు తేనీటి విందు ఇచ్చారు. ప్రయాణం పొడవునా.. ఆ తర్వాత తేనీటి విందు సందర్భంగా మహిళలతో ముఖ్యమంత్రి ఆత్మీయంగా ముచ్చటిస్తూ కుటుంబ పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, పిల్లల చదువులు, ఆరోగ్యం, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన ఓ మత్స్యకార మహిళతో మాట్లాడిన సీఎం… చేపల విక్రయానికి ఎక్కడెక్కడికి వెళ్తారని, స్త్రీ శక్తి పథకం వల్ల ఎంత మేరకు ప్రయోజనం కలుగుతోందని అడిగారు. బస్సు చార్జీల కోసం గతంలో ఖర్చయ్యే డబ్బు ఇప్పుడు మిగులుతోందని.. నెలకు సుమారు రూ.4 వేలు ఆదా అవుతోందని ఆమె తెలిపారు. తనకు మధుమేహం సమస్య ఉందని, ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ధితో మందులు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పడంతో… సీఎం ఆమె ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటే అనారోగ్య బారినపడకుండా ఉండొచ్చని, ఆరోగ్యం బాగుంటే మందుల ఖర్చు కూడా తగ్గుతుందని ముఖ్యమంత్రి సూచించారు. నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం మహిళతో మాట్లాడిన సీఎం… కుటుంబ పరిస్థితులు, పిల్లల వివరాలు, ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న లబ్ధిపై ఆరా తీశారు. స్త్రీ శక్తి పథకం ద్వారా నెలకు సుమారు రూ.1,500 ఆదా అవుతోందని ఆమె చెప్పారు. స్త్రీ శక్తితో పాటు తనకు మొత్తం నాలుగు పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు.

Ap-Cm-Bus-Travel-Shg : విద్యార్థినులకూ స్త్రీ శక్తి వరం

ముఖాముఖి సందర్బంగా ఓ యువతితో మాట్లాడిన సీఎం… విద్య కోసం ప్రతిరోజూ ఎంత దూరం ప్రయాణిస్తావని, బస్సు ఛార్జీల కోసం గతంలో ఎంత ఖర్చయ్యేదని అడిగి తెలుసుకున్నారు. స్త్రీ శక్తి పథకం విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతోందని ఆమె తెలిపారు. స్త్రీ శక్తి పథకం వల్ల తన కుటుంబ ఖర్చు తగ్గిందని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన చేనేత మహిళతో సీఎం సంభాషించారు. చేనేత ఉత్పత్తులకు ముడిసరుకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారని, తయారైన చీరలను ఎలా మార్కెటింగ్‌ చేస్తున్నారని అడిగారు. ముడిసరుకు కొనుగోలుకు వెళ్లడం, నేసిన చీరలను షాపులకు తీసుకెళ్లి విక్రయించేందుకు ఉచిత ప్రయాణం ఎంతో ఉపయోగపడుతోందని ఆమె తెలిపారు. స్త్రీ శక్తితో పాటు నేతన్న సేవలో పథకం ద్వారా అదనపు ఆదాయం వస్తోందని చెప్పారు. గతంలో తన భర్త ఒక్కరే బయటకు వెళ్లి వ్యాపారం చేసేవారని… ఇప్పుడు తాను కూడా బయటకు వెళ్లడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించుకోగలుగుతున్నామని చేనేత మహిళ వివరించారు. ఇలా ఆదా చేసుకున్న డబ్బునే పెట్టుబడిగా మలుచుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. మరో యువతి స్త్రీ శక్తి పథకం ద్వారా నెలకు సుమారు రూ.3 వేల వరకు ఆదా చేసుకుంటున్నామని సీఎంకు తెలిపారు. ప్రయాణ ఖర్చు తగ్గడంతో మిగిలే మొత్తాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటున్నామని చెప్పారు. మహిళలు ఎక్కువగా సంపాదిస్తున్నారా? పురుషులు ఎక్కువగా సంపాదిస్తున్నారా? అని సీఎం అడగ్గా.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకుని మహిళలే ఎక్కువగా సంపాదించే స్థాయికి వస్తున్నారని, తాము మరికొందరికి ఉపాధి కూడా కల్పించగలుగుతున్నామని పలువురు మహిళలు తెలిపారు. స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఇంటికే పరిమితం కాకుండా… ఇప్పుడు మార్కెట్లకు, వ్యాపార కేంద్రాలకు, ఉద్యోగాలకు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నామని పలువురు తెలిపారు.

Ap-Cm-Bus-Travel-Shg :భ‌విష్యత్ పై దృష్టి సారించండి…

స్త్రీ శక్తి పథకం వల్ల ప్రస్తుతం ఎంత ఆదా అవుతోందనే విషయంతో పాటు.. రాబోయే పదేళ్లలో ఏం సాధించాలనుకుంటున్నారో కూడా సీఎం చంద్రబాబు మహిళలను అడిగారు. కడప జిల్లాకు చెందిన ఓ ముస్లిం మహిళ తన డ్వాక్రా సంఘం ద్వారా రూ.కోటి పెట్టుబడితో వ్యాపారం చేయాలన్నది తన లక్ష్యమని తెలిపారు. విశాఖకు చెందిన ఓ ఉద్యోగిని ఏఐ రంగంలో నైపుణ్యం సాధించి.. తాను ఎంచుకున్న సాఫ్ట్‌వేర్‌ రంగంలో అగ్రస్థానానికి చేరుకోవాలనుకుంటున్నట్టు వివరించారు.

మహిళల సమాధానాలను ఆసక్తిగా విన్న సీఎం.. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కష్టపడాలని సూచించారు. పేద, మధ్యతరగతి కుటుంబాల వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే తాను మహిళలతో నేరుగా మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ ‘అను నేను’ అనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తాను బలంగా నమ్ముతానని ముఖ్యమంత్రి చెప్పారు.