2047 నాటికి తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం : భట్టి
- మహనీయుల ఆశయాలతో రాష్ట్ర అభివృద్ధి
- రాజ్యాంగమే సమాన హక్కులకు పునాది
- ప్రజాస్వామ్య పాలనకు బలమైన పునాదులు
- అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- ఖమ్మం జిల్లా పురోగతిపై భట్టి విక్రమార్క వెల్లడి
- ఖమ్మంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
- పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
ఖమ్మం, ఆంధ్రప్రభ : 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్య్ర పోరాటం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మహానుభావుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్య్రానికి అర్థం, పరమార్థం చేకూర్చే విధంగా ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నామని తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి, ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించే ప్రజాస్వామ్య పాలనకు బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. ఆ మహనీయుల ఆశయాల స్ఫూర్తితో 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అన్ని రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఖమ్మం జిల్లా సాధిస్తున్న పురోగతిని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు డిప్యూటీ సీఎం ప్రశంసాపత్రాలను అందజేశారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ

80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్, హోంగార్డు, మినిస్టీరియల్ సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
