విద్యాభివృద్ధికి నాలుగు నెలల వేతనం విరాళం..

ఊట్కూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు ముందుకు రావాలని ఎడవల్లి సర్పంచ్ ఎస్. ఆంజనేయులు ఆదర్శంగా నిలిచారు. పాఠశాల విద్యాభివృద్ధి కోసం తన నాలుగు నెలల వేతనాన్ని విరాళంగా అందజేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఎడవల్లి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు పాఠశాల అభివృద్ధికి సంబంధించిన చెక్కును అందజేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి తోడ్పడేందుకు విద్యా వాలంటీర్‌ను నియమించడంతో పాటు పాఠశాల అవసరాలకు వినియోగించేలా నెలకు రూ.6,500 చొప్పున నాలుగు నెలలకు సంబంధించిన మొత్తాన్ని అందించారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, దాతలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరిస్తే విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణం కల్పించవచ్చన్నారు. తన వేతనాన్ని పాఠశాల అభివృద్ధికి అందజేసిన సర్పంచ్ ఆంజనేయులు సేవాభావాన్ని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కల్పన, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.