నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్
- గంపలగూడెంలో 21 కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు
- రూ.12.51 లక్షల విలువైన చెక్కుల పంపిణీ
- లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
గంపలగూడెం, ఆంధ్రప్రభ: గంపలగూడెం మండల పరిధిలోని 13 గ్రామాలకు చెందిన 21 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.12,51,505 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వారి ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్ ఆపద సమయంలో అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే వారి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఏర్పడినా తన కార్యాలయాన్ని సంప్రదించాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు.
ఆపదలో పేదలకు అండగా ప్రభుత్వం..
ఆరోగ్య సమస్యల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించగా, వారి పరిస్థితిని పరిశీలించి వెంటనే సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేయించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ సహాయం మంజూరయ్యేలా ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవ చూపారు. నిధులు మంజూరైన అనంతరం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి చెక్కులు అందజేయడంతో బాధిత కుటుంబాలు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తిరువూరు నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందేలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
