అఖిల్ రాజ్, నాగదుర్గ కొత్త సినిమా షురూ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలుగు ప్రేక్షకులకు మన నేలతో, మన సంస్కృతితో ముడిపడిన కథలు ఎప్పుడూ ప్రత్యేకమే. అలాంటి వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం ‘శనార్తి’. తెలంగాణా సంస్కృతి, భావోద్వేగాలు, మనుషుల మధ్య అనుబంధాలను ప్రధానంగా తీసుకుని తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం నేడు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు.
ఈ చిత్రంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో గుర్తింపు పొందిన అఖిల్ రాజ్ ఉద్దెమర, నాగదుర్గ హీరోహీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఉప్పునూటి రాజ్ గణేష్ దర్శకత్వం వహించారు. కె.వి. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంపత్ నంది టీం వర్క్స్, ఎస్‌డీఎల్‌పీ అధికారిక నిర్మాణం నెం.2గా రూపొందుతున్న సినిమాకు టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘శనార్తి’ అనే పేరును పెట్టారు.
విభిన్న కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలో వెల్లడించనుంది. టైటిల్ ప్రకటించిన వెంటనే ‘శనార్తి’పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

