కర్నూలు జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
- హయాటస్ హెర్నియాకు ఫండోప్లికేషన్ ఆపరేషన్..
- 60 ఏళ్ల రోగికి ఉపశమనం
కర్నూలు, ఆంధ్రప్రభ: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (జీజీహెచ్) జనరల్ సర్జరీ విభాగంలో అరుదైన, క్లిష్టమైన హయాటస్ హెర్నియా కేసుకు విజయవంతంగా ఫండోప్లికేషన్ శస్త్రచికిత్స నిర్వహించారు. 60 ఏళ్ల తిరుపాల్ నాయక్ కడుపు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిని ఆశ్రయించగా, వైద్య పరీక్షలు, ఎండోస్కోపీ అనంతరం ఆయనకు గ్రేడ్-3 హయాటస్ హెర్నియా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
వైద్యులు రోగికి విజయవంతంగా ఫండోప్లికేషన్ శస్త్రచికిత్స నిర్వహించి, హయాటల్ ప్రాంతాన్ని సరిచేశారు. అలాగే ఆహారనాళం, కడుపు మధ్య భాగాన్ని బలోపేతం చేశారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి అవసరమైన చికిత్స అందించడంతో ఆయన క్రమంగా కోలుకున్నారు.
ఈ శస్త్రచికిత్సను జనరల్ సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ నాయక్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది. ఈ బృందంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రణీత్, డాక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. శస్త్రచికిత్సలో పీజీ విద్యార్థులు డాక్టర్ మనోజ్ రెడ్డి, డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ తేజేశ్వర్, డాక్టర్ ఆంచల్ కీలక సహకారం అందించారు.
అనస్థీషియా విభాగం హెచ్ఓడీ డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ రాంశివ నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాణి మంజుష, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ సుధీర్ గౌడ్, డాక్టర్ ఘియాజుద్దీన్ సమర్థవంతమైన అనస్థీషియా సేవలు అందించారు. వీరి సమన్వయంతో శస్త్రచికిత్స విజయవంతమైంది.
ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు వైద్య బృందాలను అభినందించారు. ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ నాయక్ నేతృత్వంలోని శస్త్రచికిత్స బృందం, పీజీ విద్యార్థులు, డాక్టర్ సుధీర్ ఆధ్వర్యంలోని అనస్థీషియా బృందం సమన్వయంతో క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల సేవలతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. రోగి కుటుంబ సభ్యులు వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
