హెల్మెట్‌ ధరించడం భారం కాదు.. బాధ్యత

ప్రమాదాల్లో రక్షణ కల్పించే కవచం హెల్మెట్‌: డీసీపీ లక్ష్మీనారాయణ

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించడం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని, మన ప్రాణాలను కాపాడుకునే అత్యంత ముఖ్యమైన రక్షణ కవచమని రూరల్‌ డీసీపీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

శుక్రవారం మండల పరిధిలోని ముళ్లపాడు క్రాస్‌ రోడ్డు వద్ద ఎస్‌ఐ అర్జున్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్మెట్‌ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని డీసీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్‌ ప్రాధాన్యతపై పలు సూచనలు చేశారు.

రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు తగిలే తీవ్ర గాయాలను తగ్గించడంలో హెల్మెట్‌ కీలక పాత్ర పోషిస్తుందని డీసీపీ తెలిపారు. నాణ్యమైన హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాపాయాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. తలకు, మెడకు తగిలే తీవ్ర గాయాల ప్రభావాన్ని కూడా హెల్మెట్‌ తగ్గిస్తుందని వివరించారు.

ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హెల్మెట్‌ ధరించకపోవడం వల్ల అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. హెల్మెట్‌ ధరించి వాహనం నడపడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యులకు భరోసా కల్పించినట్లవుతుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు హెల్మెట్‌ను భారంగా కాకుండా తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతగా భావించాలని డీసీపీ లక్ష్మీనారాయణ కోరారు.