ప్రతి శుక్రవారం డ్రైడే తప్పనిసరిగా పాటించాలి
- నీటి నిల్వల తొలగింపుతో దోమల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
- డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రావణ్‌బాబు
వత్సవాయి, ఆంధ్రప్రభ: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. శ్రావణ్‌బాబు వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం వత్సవాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. వైద్యాధికారి, సిబ్బందితో ఆసుపత్రి నిర్వహణ, సేవలపై సమీక్షించి గుర్తించిన లోటుపాట్లను వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో ప్రతిరోజూ పరిశుభ్రతను పాటిస్తూ రోగులకు శుభ్రమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, ఆహ్లాదకరమైన పరిసరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, ఆసుపత్రి ప్రాంగణంలోని చెట్ల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
బయోమెడికల్ వ్యర్థాలను నిబంధనల ప్రకారం భద్రపరచడం, నిర్వహించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. అనంతరం సమీపంలోని పెట్రోల్ బంకు వీధిలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. ప్రతి శుక్రవారం సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరిసరాలను తనిఖీ చేయాలని, నీరు నిల్వ ఉండే పనికిరాని వస్తువులను తొలగించాలని సూచించారు. దోమల వృద్ధికి అవకాశం లేకుండా పెరి డొమెస్టిక్ ప్రాక్టీసెస్ (పీడీపీ), యాంటీ లార్వా ఆపరేషన్స్ (ఏఎల్‌ఓ) తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి శ్రీను నాయక్, వత్సవాయి పీహెచ్‌సీ వైద్యాధికారి హర్షిత బేగం, సూపర్‌వైజర్ మిరియాల శీను, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
