Indrakeeladri | అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక వైభవం..
ఆషాఢ సారె ముగింపు వేడుకలతో ఇంద్రకీలాద్రిపై భక్తిభావ వెల్లువ
అమావాస్యనాడు వైభవంగా చండీహోమం..
అమ్మవారిని దర్శించుకున్న విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు
ఒక్కరోజే 36,816 మంది భక్తుల దర్శనం..
రూ.1.01 లక్షల కానుకల సమర్పణ
Indrakeeladri | (ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి నామస్మరణతో మార్మోగుతోంది. ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ముగియగా.. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మకు ప్రత్యేక కుంకుమార్చన సేవలకు దేవస్థానం శ్రీకారం చుట్టింది. మరోవైపు అమావాస్య సందర్భంగా నూతన యాగశాలలో చండీహోమాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా ఒకే సమయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఇంద్రకీలాద్రిపై భక్తి సందడి నెలకొంది.

శ్రావణంలో కుంకుమార్చన సేవలు..
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 13 నుంచి సెప్టెంబరు 11 వరకు నెల రోజులపాటు పూజా మంటపంలో ప్రత్యేక కుంకుమార్చన సేవలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆర్జిత సేవలు కొనసాగనున్నాయి. సేవా టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించారు. ఒక టికెట్‌పై దంపతులు లేదా ఇద్దరు భక్తులు కుంకుమార్చనలో పాల్గొనే అవకాశం కల్పించారు. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో టికెట్లు అందుబాటులో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘మనమిత్ర’ వాట్సాప్ సేవ 9552300009 ద్వారా ఇంటి నుంచే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన డిజిటల్ టికెట్ కియోస్క్‌లు, దేవస్థానం ఆర్జిత సేవా కౌంటర్లలోనూ టికెట్లు పొందవచ్చు. శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమార్చన చేయడం అత్యంత శుభప్రదమని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో వి.కె. శీనా నాయక్ కోరారు.
వైభవంగా చండీహోమం..
అమావాస్యను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై చండీహోమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాల వద్ద అర్చక స్వామి రమాకాంత్ నేతృత్వంలో శాస్త్రోక్తంగా హోమ కార్యక్రమం సాగింది. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన అమావాస్య రోజున చండీహోమం నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయన్న విశ్వాసంతో 300 మందికిపైగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హోమం అనంతరం పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదంతో పాటు శేషవస్త్రాలను అందజేశారు.

ముగిసిన ఆషాఢ సారె మహోత్సవం..
జగన్మాత శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఆడపడుచుగా భావించి నెల రోజులుగా నిర్వహించిన ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవం బుధవారం కనులపండువగా ముగిసింది. ఆషాఢ బహుళ అమావాస్య, ఆషాఢ మాస ముగింపును పురస్కరించుకుని దేవస్థానం సిబ్బంది కుటుంబ సమేతంగా అమ్మవారికి ముగింపు సారె సమర్పించారు. జమ్మిదొడ్డి వద్ద స్థానాచార్య ఆధ్వర్యంలో సారె సంభారాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాల నడుమ కనకదుర్గనగర్ మీదుగా శోభాయాత్ర సాగింది. సారె సంభారాలతో జమ్మిదొడ్డి నుంచి బయలుదేరిన శోభాయాత్ర మహామండపంలోని ఆరో అంతస్తుకు చేరుకుంది. అక్కడ కొలువైన అమ్మవారికి పట్టు వస్త్రాలు, మంగళద్రవ్యాలు, ఫలహారాలు, ఇతర సారె సంభారాలను భక్తిశ్రద్ధలతో నివేదించారు. దేవస్థానం సిబ్బంది తరఫున ఈవో వి.కె. శీనా నాయక్ దంపతులు, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) అమ్మవారికి ముగింపు సారె సమర్పించారు.
భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు..
ఆషాఢ మాస ముగింపు, అమావాస్య సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, సాధకులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తులు అమ్మవారికి మోదకంతో సారె సమర్పించారు. అనంతరం అర్చకులు సామూహిక ఆశీర్వచనం అందించి ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు కోట ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ సి.హెచ్. రంగారావు, ఈఈ ఎల్. రమాదేవి, అసిస్టెంట్ ఈవోలు ఎన్. రమేష్‌బాబు, ఎం. తిరుమలరావు, డాక్టర్ కె. గంగాధర్, డీఈఈలు అశోక్‌కుమార్, రవీంద్రనాథ్ ఠాగూర్, సూపరింటెండెంట్లు సి.ఎల్.ఎన్. రాజు, బి. కళ్యాణి, చందు శ్రీనివాస్ తదితర అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు పి. రాఘవరాజు, హరికృష్ణ, ఎ. శ్రీనివాసరావు, జి. సరోజినీదేవి తదితరులు పాల్గొన్నారు.

వీఎచ్‌పీ ప్రముఖుల ప్రత్యేక పూజలు…
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్లాల్ బాగ్డా, కేంద్రీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి కోటేశ్వర శర్మ, విహెచ్పీ క్షేత్ర కార్యదర్శి రవికుమార్ ఇంద్రకీలాద్రికి విచ్చేసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవస్థానం తరఫున వారికి ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం పాలకమండలి సభ్యులు పెనుమతి రాఘవరాజు, అవ్వారు బుల్లబ్బాయి వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రి క్షేత్ర పవిత్రతను కాపాడడంతో పాటు హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వీఎచ్‌పీ ప్రముఖులు ఆకాంక్షించారు.
ఒక్కరోజులో 36,816 మంది దర్శనం..
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీకి దేవస్థానం గణాంకాలు అద్దం పడుతున్నాయి. ఆగస్టు 12న మొత్తం 36,816 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అదే రోజు 4,211 దర్శన టికెట్లు జారీ అయ్యాయి. భక్తులకు మొత్తం 47,306 యూనిట్ల ప్రసాదం అందించారు. నగదు, ఆన్లైన్ రూపంలో కలిపి రూ.1,00,923 విరాళాలు సమకూరాయి. వివిధ ఆర్జిత సేవల్లో 362 మంది, తలనీలాల సమర్పణలో 518 మంది పాల్గొన్నారు. అన్నదాన ప్రసాదాన్ని 8,902 మంది స్వీకరించారు. అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాస ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తవుతుండటంతో రానున్న రోజుల్లో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతోపాటు ఆర్జిత సేవలను సజావుగా నిర్వహించేందుకు దేవస్థానం యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
