సమయం ఉన్నా లేకున్నా ప్రజల మధ్యే
నిమిషం వృథా చేయను.. ప్రజాసేవే నా లక్ష్యం: ఎమ్మెల్యే జయసూర్య
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు ప్రజాసేవే తనకు ముఖ్యమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. సమయం ఉన్నా లేకున్నా ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేస్తానని, తన ప్రతి నిమిషం ప్రజల కోసమేనని స్పష్టం చేశారు.

గురువారం పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం.. అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికీ’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లలో పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకే ఇంటింటికీ వెళ్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. తనకు పండుగలు, ఇతర కార్యక్రమాల కంటే ప్రజలే ముఖ్యమని, ప్రజలే తన కుటుంబమని అన్నారు.
ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విరామం లేకుండా వార్డులోని ప్రతి ఇంటికీ తిరిగి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వృద్ధులు, మహిళలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎండ, వర్షాలను సైతం లెక్కచేయకుండా ఎమ్మెల్యే కాలినడకన వీధుల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్న తీరు స్థానికులను ఆకట్టుకుంటోందన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కరోజు కూడా ఖాళీగా కూర్చోలేదని తెలిపారు.
నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో ఇప్పటికే మూడుసార్లు పర్యటించారని, కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజలను కలిశారని చెప్పారు.
ఉదయం నందికొట్కూరు, మధ్యాహ్నం మిడుతూరు, సాయంత్రం పగిడ్యాల ఇలా ఒక్కరోజులోనే మూడు మండలాల్లో పర్యటిస్తున్నారని, ఎమ్మెల్యే పనితీరును చూసి తామే ఆశ్చర్యపోతున్నామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఫోన్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రజల కష్టాలు తీర్చడానికే పదవి అని ఎమ్మెల్యే చెప్పే మాటలు ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు.
పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎమ్మెల్యేలు కార్యక్రమాలు, వేడుకలకు మాత్రమే వచ్చేవారని, అయితే జయసూర్య పెళ్లి, చావు, చిన్న సమస్య ఏదైనా ప్రజల మధ్యకు వస్తున్నారని తెలిపారు. తన సమయం అంతా ప్రజలదేనని ఎమ్మెల్యే చెబుతుంటారని అన్నారు.
కార్యక్రమంలో పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే వారం మిగిలిన వార్డుల్లోనూ పర్యటిస్తానని ఎమ్మెల్యే జయసూర్య ప్రకటించారు.
