స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలి: జిల్లా ఇన్చార్జి కలెక్టర్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : స్వాతంత్య్ర స్ఫూర్తి ఉట్టిపడేలా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎం. నవీన్ ఆదేశించారు.
ఈ నెల 15న పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆయన గురువారం పరేడ్ గ్రౌండ్లో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పరేడ్ నిర్వహణ, ముఖ్య అతిథులకు వేదిక ఏర్పాటు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య శిబిరం, అగ్నిమాపక, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల భాగస్వామ్యం, వివిధ శాఖల ప్రదర్శన స్టాళ్ల ఏర్పాటు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వేడుకలకు వచ్చే ప్రజలు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
