28-Zps-Ap : న‌యా జెడ్పీ జోష్ ,. Andhra Prabha Exclusive Story

28-Zps-Ap : న‌యా జెడ్పీ జోష్ ,. Andhra Prabha Exclusive Story

  • ఎన్నిక‌ల‌కు ముందే విభ‌జ‌న
  • తెర మీద‌కు 28 జెడ్పీలు

(ప‌ల్నాడుబ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌):

కొత్త జిల్లాలకూ జిల్లా పరిషత్తుల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్తుల సంఖ్యను 28కి పెంచాల్సి ఉంటుంది. కొత్త జిల్లాల్లోనూ జడ్పీలు ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్తుల్లో ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం వచ్చే నెల 24తో ముగియనుంది. ఈలోగా కొత్త జిల్లా పరిషత్తుల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టనున్నారు. గ‌త‌ ప్రభుత్వం 2022లో చారిత్రక నిర్ణయం తీసుకుంది. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 26కు పెంచారు. అయితే అప్పటికే జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించినందున జిల్లా పరిషత్తుల విభజన అంశం తెరపైకి రాలేదు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌ కార్యవర్గాల పదవీకాలం సెప్టెంబర్‌ 25వ తేదీతో ముగినుండడంతో ‘జెడ్పీల విభజన’ ప్రక్రియ తెరపైకి వచ్చింది. అంతకు మునుపే అంటే ఆగస్టు నెలాఖరులోగా జిల్లా పరిషత్తులను విభజించి ఎన్నికలకు సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాల విభజనలో భాగంగానే ఉద్యోగులు, ఇతర మౌలికాంశాల కేటాయింపుల నిష్పత్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. గ‌తంలో 2022 ఏప్రిల్ 4న ఉమ్మడి గుంటూరు జిల్లాను పునర్‌వ్యవస్థీకరించి, నరసరావుపేట ప్రధాన కేంద్రంగా కొత్త పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే జిల్లాల విభజన జరిగినప్పటికీ, జిల్లా పరిషత్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అధికారికంగా ప్రత్యేకంగా పల్నాడు పేరుతో విడిగా జడ్పీ ఏర్పాటు అంశంపై పూర్తి స్థాయి స్పష్టత లేదా ప్రత్యేక మార్పులు ఇంకా చోటుచేసుకోలేదు.
ఎన్నిక‌ల‌కు విభజ‌న త‌ప్ప‌దు…
పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం కొత్త జిల్లాల్లో విధిగా జిల్లా పరిషత్తులు ఏర్పాటుచేసి ఎన్నికలు నిర్వహించాలి. 2021 సెప్టెంబరులో జడ్పీలకు ఎన్నికలు నిర్వహించేనాటికి కొత్త జిల్లాలు ఏర్పాటుకాలేదు. తర్వాత జిల్లాల విభజనలో 13 జిల్లాలు 28కి పెరిగాయి. జిల్లాల విభజన నాటికే జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించడంతో.. జడ్పీల పునర్విభజనపై ప్రభుత్వం ఇప్పటివరకు దృష్టిపెట్టలేదు. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం త్వరలో ముగియనుండడంతో ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్‌ల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసేందుకు సమయం పడుతుంది. అందుకే పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ ఆ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటిని ప్రభుత్వానికి పంపి క్యాబినెట్‌ ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆ తర్వాత ఆయా జిల్లా పరిషత్‌లకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులతో పాటు అదనపు సిబ్బందినీ మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎన్నికల్లోపే పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ చర్యలు చేపట్టింది. ఇంకోవైపు.. సెప్టెంబరు 24వ తేదీ లోపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనందున మండల పరిషత్‌ అధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్ల స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకానికి పంచాయతీరాజ్‌శాఖ సిద్ధమవుతోంది.
జిల్లా ప‌రిష‌త్‌ల ఏర్పాటుతో ప్ర‌యోజ‌నాలు ఇవే..
ఉమ్మడి జిల్లాల పరిధి చాలా విస్తృతంగా ఉండటంతో గ్రామీణ ప్రాంత సమస్యలపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టడం కష్టమయ్యేది. కొత్త జడ్పీల ఏర్పాటుతో పాలనా పరిధి తగ్గి, గ్రామీణ సమస్యలపై ప్రత్యక్ష పర్యవేక్షణ పెరుగుతుంది. చిన్న జిల్లా పరిషత్ పరిధి ఉండటం వల్ల అభివృద్ధి పనుల అనుమతులు, సమీక్షలు వేగంగా పూర్తవుతాయి. ప్రతీ కొత్త జిల్లాకు ప్రత్యేకంగా జడ్పీ ఏర్పాటు కావడం వల్ల కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర పంచాయతీరాజ్ నిధులు నేరుగా ఆయా జిల్లాలకు విడిగా సమకూరుతాయి. వెనుకబడిన , గ్రామీణ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. గ్రామీణ రోడ్ల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా పరిషత్ పాఠశాలల నిర్వహణ, రక్షిత మంచినీటి పథకాల అమలు రాకెట్ స్పీడ్‌తో వేగవంతమవుతాయి. ఆయా ప్రాంత భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా స్థానిక మౌలిక వసతుల లేమిని త్వరగా గుర్తించి పరిష్కరించవచ్చు. స్థానిక ప్రజాప్రతినిధులు (జెడ్పీటీసీ, ఎంపీటీసీ) తమ నియోజకవర్గాల సమస్యలను జిల్లా కేంద్రానికి వెళ్లి జడ్పీ సాధారణ సమావేశాల్లో లేవనెత్తడం సులువవుతుంది.ప్రతి కొత్త జడ్పీకి సీఈవో , డిప్యూటీ సీఈవో పోస్టులతో పాటు ప్లానింగ్, విద్యా, ఇంజనీరింగ్ శాఖలకు చెందిన ప్రత్యేక యంత్రాంగం అందుబాటులోకి వస్తుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ఇ తర గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుంది.ఫిర్యాదుల వేగవంతమైన పరిష్కారం: ప్రజలకు పరిపాలన దగ్గరవ్వడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజల వినతులు, సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయి.