భారీ జాతీయ జెండాతో ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ..
ఏలూరు, ఆంధ్రప్రభ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో ఏలూరు జిల్లాలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ సైకిల్ ర్యాలీ ఘనంగా సాగింది. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి కె., ఐఏఎస్, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఐఏఎస్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
భారీ జాతీయ జెండాతో ప్రారంభమైన ఈ ర్యాలీ ఏలూరు నగర వీధుల గుండా కొనసాగింది. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ముందుకు సాగిన అధికారులు, విద్యార్థులు, ప్రజలతో నగరమంతా దేశభక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వి మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల గౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేయడమే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, జాతీయ జెండా దేశ సమైక్యతకు, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమం దేశభక్తిని మరింతగా పెంపొందించేలా సాగింది.
