రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ఇంటింటికీ కుట్టు మిషన్లు
1.19 లక్షల మంది మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు
ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ..
ఒక్కో మిషన్ విలువ రూ.12 వేలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, ఇంటి నుంచే స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. బీసీ మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యం ఇస్తోందని పొన్నం ప్రభాకర్ చెప్పారు. కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న బీసీ మహిళలకు ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడం ద్వారా వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు కుటుంబ ఆదాయాన్ని పెంచేందుకు ఈ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు.
119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల మిషన్లు
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేలుగా ఉండగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీపై అందజేయనున్నారు. ఈ పథకానికి అర్హులైన బీసీ మహిళల నుంచి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకంగా చేపడతామని చెప్పారు.
పేదలు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం
కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే పథకం ప్రధాన ఉద్దేశమని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో ఇప్పటికే అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల మేరకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. కుట్టు మిషన్లు పొందిన మహిళలు వాటిని సమర్థంగా వినియోగించుకునేలా అవసరమైన శిక్షణ కూడా అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తద్వారా మిషన్లు పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగియకుండా.. వాటి ద్వారా మహిళలకు నిరంతర ఆదాయం వచ్చేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
తొలి దశలో 1.19 లక్షల మందికి అవకాశం
కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న లక్ష్యానికి అనుగుణంగా తొలి దశలో 1.19 లక్షల మంది అర్హులకు ప్రయోజనం కల్పిస్తామని చెప్పారు. భవిష్యత్‌లో పథకాన్ని మరింత విస్తరించి, ఎక్కువ మంది బీసీ మహిళలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మహిళల స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రోత్సాహం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ, ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదే దిశలో ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం ద్వారా మహిళలు ఇంటి వద్ద నుంచే ఉపాధి పొందే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించి పనులను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. బలహీన వర్గాల ప్రజాప్రతినిధులతో ఇటీవల సమావేశం నిర్వహించి బీసీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. కులగణన అనంతరం బీసీల అభివృద్ధికి సంబంధించి తదుపరి కార్యాచరణను కూడా ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.
పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ
ఈ నెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలేను స్మరించుకుంటూ ప్రగతి భవన్‌కు ‘మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్’గా, సచివాలయానికి ‘డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం’గా పేర్లు మార్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహం
ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు బీసీ ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
